
మొలకెత్తని ఎంటీయూ–1271
సత్యవేడు సబ్ డివిజన్‌లో నకిలీ వరి వంగడాలు రైతులను నిలువు దోపిడీ చేస్తున్న వ్యాపారులు అధిక ధరలకు విత్తన విక్రయాలు ఆందోళనలో అన్నదాతలు
గత ఏడాది వరదయ్యపాళెం మండలంలో ఎంటీయూ–1271 రకం వరి విత్తనాలు మొలకెత్తక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రైవేటు దుకాణదారులు నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించిన కారణంగా ఈ దుస్థితి దాపురించింది. మండలంలోని కురింజల్లం, సీఎల్‌ఎన్‌పల్లె, కడూరు, నెల్లటూరు, తాగేలి, అరుదూరు తొండంబట్టు ప్రాంతాల్లో రైతులు నకిలీ విత్తనాల బారిన పడ్డారు. బాధిత రైతులు దీనిపై వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
రబీ సీజన్‌కు సంబంధించి రైతులు వరిసాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ మద్దతు లేకపోవడంతో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు నిలువు దోపిడీకి తెరతీస్తున్నారు. నకిలీ వంగడాలను అధిక ధరలకు అంటగట్టి అన్నదాతను దగా చేస్తున్నారు. మొలకెత్తని విత్తనాలతో గత ఏడాది అనుభవాలను గుర్తుచేసుకుని రైతులు మధన పడుతున్నారు. ఆరుగాల కష్టం.. నష్టాలపాలవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు ఇప్పటికై నా స్పందించి సహకారం అందించాలని కోరుతున్నారు.
వరదయ్యపాళెం : జిల్లాలోని తూర్పు మండలాలైన వరదయ్యపాళెం, బీఎన్‌కండ్రిగ, సత్యవేడు, కేవీబీపురం, నాగలాపురం ప్రాంతాల్లో వరి పంట ప్రాధాన్యతగా సాగు చేస్తారు. అయితే వ్యాపారులు మాత్రం రైతులను నకిలీ విత్తనాలతో నిలువునా మోసం చేస్తున్నారు. ఈ మేరకు ఏటా నకిలీ విత్తనాల ముప్పు రైతులను వెంటాడుతోంది. గత ఏడాది వరదయ్యపాళెం, బీఎన్‌కండ్రిగ, సత్యవేడు, కేవీబీపురం మండలాల్లో పలుచోట్ల నకిలీ విత్తనాలతో అన్నదాతలు నారుమడుల దశలోనే నష్టపోయారు. అయితే ఈ ఏడాది కూడా ఆ పరిస్థితులు పునరావృతం అవుతాయా? అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలోనే సత్యవేడు నియోజకవర్గ వ్యాప్తంగా వరి సాగుకు రైతులు సమాయత్తమయ్యారు. ప్రైవేట్ దుకాణాల వద్ద వరి విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.
బిల్లులు ఇవ్వకనే..
దుకాణదారులు రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, పురుగు మందులకు కనీసం బిల్లులు కూడా ఇవ్వడం లేదు. షాపుల వద్ద ధరల పట్టికతో బోర్డులు సైతం ఏర్పాటు చేయడంలేదు. ఎంఆర్‌పీ కంటే రూ. 30 నుంచి రూ.50 అధికంగా వసూలు చేస్తున్నారు. అధికారుల హెచ్చరికలను బేఖాతర్ చేస్తున్నారు. ఆ దశగా సత్యవే డు నియోజకవర్గంలోని 7 మండలాల్లో 30 మందికి పైగా ప్రైవేటు డీలర్లు ఉన్నారు. వీరి ఆగడాలకు అడ్డూ అదుపే లేదు. ఇదే విధంగా పురుగు మందులు, ఎరువుల విషయంలోనూ అత్యధిక ధరలకు విక్రయిస్తూ వ్యాపారులు మాత్రం రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు.
రబీకి సిద్ధమవుతున్న నారు మడులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేయూత
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులకు చేయూతనందించారు. గ్రామస్థాయిలో ఎరువు లు, పురుగు మందులను రైతు భరోసా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచేవారు. నకిలీ విత్తనాల నియంత్రణకు నియోజకవర్గానికి ఓ అగ్రి ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఆ ల్యాబ్‌లు వినియోగం నామమాత్రం కావడంతో ప్రైవేటు వ్యాపారుల అక్రమాలకు రెక్కలొచ్చాయి. దీంతో ఇష్టారాజ్యంగా వ్యాపారులు రైతులను దోపిడీ చేసేందుకు సిద్ధమయ్యారు.

మొలకెత్తని ఎంటీయూ–1271

మొలకెత్తని ఎంటీయూ–1271

మొలకెత్తని ఎంటీయూ–1271

మొలకెత్తని ఎంటీయూ–1271