
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రేపే అంకురార్పణ
తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల నడుమ ‘అంకురార్పణ’ ఘట్టంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆలయంలోని యాగశాలలో అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.
సేనాధిపతి ఉత్సవం
శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుల వారికి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విష్వక్సేనులవారు మాడ వీధుల్లో ఊరేగుతారని ప్రాశస్త్యం.
బీజవాపనం
వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ముందుగా పాలికల్లో(మట్టికుండలు) పుట్ట మన్ను నింపుతారు. వీటిలో నవధాన్యాలు పోస్తారు. ఈ విత్తనాలు బాగా మొలకెత్తాలని కోరుతూ ఓషధీసూక్తాలను పఠిస్తారు. పాలికల చుట్టూ 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు. పాలికల్లోని నవధాన్యాలను బ్రహ్మోత్సవాల 9 రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున ఈ మొలకలను వేరుచేసి స్వామివారికి అక్షతారోపణ చేస్తారు.