
శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
వడమాలపేట (పుత్తూరు) : అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాల్లో రెండవ రోజైన గురువారం స్వామి వారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. అనంతరం మూలవిరాట్టు, ఉత్సవర్లకు, పద్మావతీ, ఆండాళ్ అమ్మవారు, జయ విజయులు, గరుడాళ్వార్, ఆంజనేయస్వామికి, ధ్వజస్థంభం, ఇతర పరివార దేవతలకు పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమాలను డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ పర్యవేక్షించారు.
పవిత్రోత్సవాల్లో నేడు
పవిత్రోత్సవాల్లో శుక్రవారం ఉదయం 9–30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన నిర్వహించనున్నారు.