
గోవిందదాసుడిగా ఎన్ని కష్టాలకై నా సిద్ధం
తిరుపతి మంగళం : శ్రీరాముడి పట్ల అకుంటితమైన పరమభక్తుడిగా ఆనాడు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో.. అదేవిధంగా ఈరోజు గోవిందదాసుడిగా శ్రీవారి ఆలయ పరిరక్షణ, హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం తాను ఎన్ని కష్టాలు పడడానికై నా సిద్ధమేనని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. తిరుపతి పద్మావతీపురంలోని తన నివాసంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అలిపిరి పాదాల చెంత మలమూత్రాలు, మద్యం బాటిళ్ల మధ్య మహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ పాలకవర్గం, అధికారులు పడవేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విషయాన్ని ఎత్తిచూపితే తనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడంతో పాటు ఎదురు దాడులకు సిద్ధపడడం సిగ్గుచేటన్నారు. త్రిశూలధారి శివుడు, శంకుచక్రధారి శ్రీమహావిష్ణువు, వేదవాంజ్ఞ్మయధారి చతుర్ముఖుడైన బ్రహ్మ అని అందరికీ తెలిసిన విషయమన్నారు. ఇవేవీ తెలియని మూర్ఖుల్లా, చేసిన తప్పిదాలను సరిదిద్దుకోకుండా తనపై లేనిపోని అభాండాలు వేస్తూ దానికి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. ఈ రోజు ఓ పత్రికలో పెద్ద వ్యాసం వచ్చిందని, ఆ కళాశాల ప్రిన్సిపల్‌తో బలవంతంగా మాట్లాడించడమే కాకుండా కణ్ణన్ ఆచారి అనే వ్యక్తి కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు రూ.2 లక్షలు శనేశ్వరస్వామి విగ్రహాన్ని తయారు చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చారని, ఆ తర్వాత అతను చనిపోతే, టీటీడీ కాంట్రాక్టర్లు ఎవరో ఆ విగ్రహాన్ని అలిపిరి పాదాల చెంత టీటీడీ స్థలంలో తీసుకొచ్చి పడేశారని చెప్పడం వారి కట్టుకథలకు నిదర్శనమన్నారు. రాయలచెరువు దగ్గర తయారు చేసిన శనేశ్వరస్వామి విగ్రహాన్ని టీటీడీ స్థలంలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవేవీ తెలియకుండా టీటీడీ పాలకవర్గంతో పాటు అధికారులు తానేదో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నట్లుగా చిత్రీకరించి తనపై లేనిపోని అవాస్తవ కేసులను పెట్టి నోటీసులు జారీచేశారని మండిపడ్డారు. తాను ఇలాంటి కేసులకు భయపడేవాడిని కాదని, తనపై ఎన్ని కేసులు పెట్టినా హైందవ ధర్మ పరిరక్షణను, శ్రీవారి ప్రతిష్టను కాపాడుకునేందుకు టీటీడీలో జరిగే తప్పిదాలను ఎత్తిచూపుతూనే ఉంటానన్నారు.