
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుమలలో గురువారం టీటీడీ అదనపు ఈవోతో కలసి ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ భక్తుల భద్రత, సౌకర్యం కోసం సమగ్రంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ట్రాఫిక్, క్యూలైన్లు, అత్యవసర వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం అంశాలపై దృష్టి పెట్టామన్నారు. ఎలాంటి ఇబ్బందు లు ఎదుర్కోకుండా టీటీడీ విభాగాలతో సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. 4 వేల మంది పోలీసులు, కెమెరాలతో నిరంతరం నిఘా ఉంచామన్నారు. ఇంటిగ్రేడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. గరుడ సేవ రోజున రద్దీని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, వాహనాల పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుపతిలో ఐదు ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామ న్నారు. ఆ స్థలాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు భక్తులను తరలిస్తామని తెలిపారు. అనంతరం టీటీడీ సీవీఎస్ ఓ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆక్టోపస్, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు నిరంతరం భక్తుల భద్రతను పర్యవేక్షిస్తాయన్నారు. పార్కింగ్ స్థలాలను తెలియజేసే వీడియోలను కూడా విడుదల చేస్తామన్నారు. వాహన సేవకు వచ్చే భక్తులు గ్యాలరీలో ఉండే సమయంలో పాదరక్షలు, లగేజీలు తీసుకురావద్దని విన్నవించారు. శ్రీవారి వాహనాలపై చిల్లర నాణ్యాలు విసరడం నిషేధించామని పేర్కొన్నారు.
భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోండి
ఎస్పీ సుబ్బరాయుడు తిరుమలలోని టాక్సీ డ్రైవర్లతో సమావేశమయ్యారు. భక్తులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నా రు. గరుడ సేవ రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే దృష్ట్యా భక్తులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పెద్దవారికి రూ.110, చిన్నపిల్లలకు రూ.60 మాత్రమే తీసుకోవాలన్నారు.