
19న చలో మెడికల్ కాలేజీని విజయవంతం చేయండి
తిరుపతి రూరల్: పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, జగనన్న ప్రభుత్వంలో కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటుపరం చేయాలని చూడడాన్ని అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని పార్టీ కార్యాలయంలో బుధవారం యువజన విభాగం, విద్యార్థి విభాగం నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన మదనపల్లెలో ప్రయివేటు పరం చేయనున్న మెడికల్ కాలేజీని సందర్శించి నిరసన వ్యక్తం చేయనున్నట్టు తెలిపారు. ఆ నిరసనకు పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, యువజన విభాగం నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభిస్తే ఆయనకు మంచిపేరు వస్తుందన్న అక్కసుతో ఒకటిన్నర సంవత్సరంగా పేద విద్యార్థులకు ఆ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకురాకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తేందని విమర్శించారు. ఏడాదిన్నర కాలంగా ఆ కాలేజీలను ప్రారంభించకపోవడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారని, వైద్య విద్యను పేదలకు దూరం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమా..? అంటూ ప్రశ్నించారు. జగనన్న చేసిన మంచిని కూటమి ప్రభుత్వం ఎంతో కాలం కప్పి పుచ్చలేరని, ఆ ప్రభుత్వంలో కట్టించిన కాలేజీలను వెలుగులోకి తీసుకురావడానికి వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం మెడికల్ కాలేజీల సందర్శనకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే జిల్లా నలుమూలల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు మదనపల్లె మెడికల్ కాలేజీకి వెళ్లి సందర్శించడం, అక్కడే వైద్య విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని బహిర్గతం చేయనున్నట్లు చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి వెల్లడించారు.
చలో మెడికల్ కాలేజీ పోస్టర్ల ఆవిష్కరణ
19న చలో మెడికల్ కాలేజీ పేరిట ముద్రించిన పోస్టర్లను చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆ పోస్టర్లను ప్రతి మండలంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు తెలిసేలా పంపిణీ చేయాలని, 19వ తేదీన ప్రతి ఒక్కరు మదనపల్లె చేరుకుని పేద విద్యార్థులకు బాసటగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బి ఓబుల్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శశిధర్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడూరు రఫీ, వినోద్ కుమార్, నక్క హరినాథ్ , శేష రెడ్డి, యువజన విభాగం మండల అధ్యక్షులు ముని రెడ్డి, రామ్ తేజ్ , జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్, వెంకటరమణ నాయక్ , ప్రతీప్, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.