
లక్ష్య సాధనపై ఫోకస్ ముఖ్యం
– ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజీ విద్యార్థినులకు వీసీ ప్రొఫెసర్ ఉమ ఉద్బోధ
తిరుపతి సిటీ: ఇంటర్మీడియెట్ దశ విద్యార్థి జీవితంలో కీలకమని, ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేస్తే అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చని పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఉమ ఉద్బోధించారు. బుధవారం పద్మావతి మహిళా జూనియర్ కళాశాల విద్యార్థి సంఘం ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆమె మాట్లాడారు. జీవితంలో కౌమార దశ కీలకమని, ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో పెడదోవ పట్టించేవి వివిధ ఉపకరణాలు, మాధ్యమాలు ఉన్నాయని, అలాంటి వాటి వైపు ఆకర్షితులు కాకుండా లక్ష్యసాధనపై ఫోకస్ పెట్టి ముందుకుపోవాలన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్షల్ని నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యమని గుర్తెరిగి దేశం గర్వించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. టీటీడీ డీఈఓ వెంకట సునీల్ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవరచుకోవాలనే దృష్టితో విద్యార్థి సంఘాలను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. టీటీడీ విద్యాసంస్థల ప్రతిష్టను ఇనుమడించేలా విద్యార్థులు అన్నింటా రాణించాలన్నారు. అనంతరం విద్యార్థి నాయకులకు అతిథుల చేతుల మీదుగా ధృవపత్రాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సీ.భువనేశ్వరి, ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, టీటీడీ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతమ్మ, టీటీడీ విద్యాశాఖ సూపరింటెండెంట్ శివకుమార్‌ర, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
తిరుపతి అన్నమయ్య సర్కిల్: ప్రభుత్వం సీపీఎస్ విధానం రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగిస్తామని టీటీడీ సీపీఎస్ ఉద్యోగుల ఫ్రంట్ నేత గోల్కొండ వెంకటేశం స్పష్టం చేశారు. బుధవారం తిరుపతిలో నిర్వహించిన సీపీఎస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004లో సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడే వ్యతిరేకించామన్నారు. రెండు దశాబ్దాల కాలంలో మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి కాటా గుణశేఖర్ మాట్లాడుతూ, ఉద్యోగుల డబ్బుని షేర్ మార్కెట్లో పెట్టి ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని విమర్శించారు.