
సమావేశంలో మాట్లాడుతున్న భూమన అభినయ్ రెడ్డి
19న మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద నిరసన
పార్టీ శ్రేణులు తరలిరావాలని భూమన అభినయ్‌రెడ్డి పిలుపు
తిరుపతి మంగళం : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసి పేదలకు ఉచిత వైద్య విద్యను అందించేందుకు ఎంతో కృషి చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు అందిస్తానన్న సంక్షేమ పథకాలు అందించకపోగా, పేద విద్యార్థుల కోసం నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు.
పేదలకు ద్రోహం చేస్తూ సంపన్నులకు దోచిపెట్టడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం కాకుండా వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు మదనపల్లి వద్ద జగనన్న నిర్మించిన మెడికల్ కళాశాల ప్రైవేటు పరం కాకుండా ఈనెల 19న మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో కార్పొరేటర్లు, పార్టీ వివిధ అనుబంధ విభాగాల అద్యక్షులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.