
కనికరం లేని కూటమి
తిరుపతి తుడా : చిన్నపిల్లలనే కనికరం కూడా లేకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా పాలన సాగిస్తోందని టీటీడీ బోర్డు మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి మండిపడ్డారు. సోమవారం అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న శ్రీపద్మావతి చిన్నపిల్లల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించారు. భూమన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానస పుత్రికగా రూ.302 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు కుట్రపూరితంగా ఆస్పత్రి పనులను నిలిపివేసిందని ఆరోపించారు. దీనిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించడంతో తూతూమంత్రంగా మళ్లీ పనులు చేపట్టిందని విమర్శించారు. రాష్ట్ర విభజన అనంతరం చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేని లోటును నాటి సీఎం వైఎస్ జగన్ గుర్తించి, టీటీడీ సహకారంలో అత్యున్నత వైద్యప్రమాణాలతో ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. ఖరీదైన వైద్యం అందక ఏ తల్లీ తన బిడ్డను పోగొట్టుకోకూడదనే సదుద్దేశంతో ఆలోచించారని కొనియాడారు. 2022లో ఆస్పత్రి పనులు ప్రారంభించి, 2024 ఎన్నికల ముందు నాటికి 75శాతం నిర్మాణం పూర్తి చేశామని వెల్లడించారు. అయితే జగన్‌మోహన్‌రెడ్డికి క్రెడిట్ వస్తుందనే దురుద్దేశంతో తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆస్పత్రి పనులను నిలిపివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రిపై ప్రభుత్వానికి, టీటీడీ పాలకమండలికి ఎందుకంత ద్వేషమని ప్రశ్నించారు. కేవలం పేరు కోసం పసిబిడ్డల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదన్నారు. మరో మూడు నెలల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేయకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం స్విమ్స్ ప్రాంగణంలోని కార్డియాక్ న్యూరో సైన్సెస్ బ్లాక్‌ను సందర్శించారు. ఈ బ్లాక్ నిర్మాణానికి రూ.97 కోట్లు మంజూరు చేశామని, తమ హయాంలోనే 40శాతం పనులు పూర్తి చేశామని, అయితే కూటమి ప్రభుత్వం ఇది కూడా నిలిపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మించిన చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్ దేశవ్యాప్తంగా పేరుప్రతిష్టలు సాధించిందని తెలిపారు. గతంలో టీటీడీ బోర్డు చైర్మన్‌గా స్విమ్స్ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించామని వివరించారు. పేద ప్రజలకు ఉపయోగపడే అంశాలను రాజకీయాలతో ముడిపెట్టడం దారుణమని, ఇప్పటికై నా ప్రభుత్వం, టీటీడీ పాలకమండలి కళ్లు తెరవాలని సూచించారు. లేకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కనికరం లేని కూటమి