
హత్య కేసులో నిందితుల అరెస్ట్
చిల్లకూరు : గూడూరులోని గాంధీనగర్ ప్రాంతం సమాధుల తోట వద్ద జరిగిన రహీద్ హత్య కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. టూటౌన్ పోలీస్‌స్టేషన్ వద్ద విలేకర్లకు వివరాలను వెల్లడించారు. సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ క్షణికావేశంలోనే హత్య జరిగినట్లు తెలిపారు. ఐదు రోజుల క్రితం ఎస్‌కే రహీద్ బాషా అనే యువకుడి హత్య కేసులో విచారణ చేపట్టామన్నారు. మృతుడి స్నేహితులు పాలకుర్తి వెంకటేశ్వర్లు, ఎస్‌కే షఫీర్ నిందితులుగా గుర్తించామని తెలిపారు. మద్యం తాగిన తర్వాత సిగరెట్ విషయంలో వివాదమేర్పడి హత్యకు దారితీసినట్లు వివరించారు. రహీద్‌ను కత్తితో పొడిచి విషయం వందన అనే మహిళకు తెలియజేయగా, ఆమె వాళ్లకు ఆశ్రయం కల్పించిందని చెప్పారు. హత్యాయుధాన్ని సైతం భద్రపరిచినట్లు తెలిపారు. తర్వాత ముగ్గురూ తూర్పు కనుపూరుకు వెళ్లి వస్తుండగా వరగలి క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.