
విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ
● కేజీ వెండి, 50 సవర్ల బంగారం, రూ.5లక్షల నగదు అపహరణ
చంద్రగిరి : స్థానిక ప్రశాంతినగర్‌లోని సీఆర్‌పీఎఫ్ విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ నజీర్ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. వివరాలు.. నజీర్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం పాకాల మండలం రమణయ్యగారిపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలోని కిలో వెండి, 50 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5లక్షల నగదును దుండగులు అపహరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చట్టాలపై అవగాహన అవసరం
తిరుపతి కల్చరల్ : బంగారు వ్యాపారులకు చట్టాలపై అవగాహన అవసరమని ఏపీ బులియన్ గోల్డ్ సిల్వర్ అండ్ మర్చంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి విజయ్‌కుమార్ తెలిపారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బంగారు వ్యాపారుల సంక్షేమమే లక్ష్యంగా అసోసియేషన్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. అయితే ఇకేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలపై అవగాహన లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. వ్యాపారులందరికీ చట్టాలపై అవగాహ కల్పించాలనే లక్ష్యంతో ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అనంతరం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కోడ్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నవంబర్ 21, 11, 23వ తేదీల్లో విజయవాడలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.శంకరరావు, కోశాధికారి అనిల్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ.సత్యనారాయణ, ఎస్.జితేంద్ర కుమార్, కార్యదర్శి బాబు, పీఆర్‌ఓ శివ, భాస్కర్, రమణ, వంశీ పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో కృష్ణ తేజ అతిథిగృహం వరకు భక్తులు బారులు తీరారు. శనివారం అర్ధరాత్రి వరకు 82,149 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,149 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.85 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ