క్రేజ్‌ తగ్గిన పీజీ | - | Sakshi
Sakshi News home page

క్రేజ్‌ తగ్గిన పీజీ

Sep 15 2025 9:13 AM | Updated on Sep 15 2025 9:13 AM

క్రేజ్‌ తగ్గిన పీజీ

క్రేజ్‌ తగ్గిన పీజీ

● 32వేల సీట్లకు 9,765 దరఖాస్తులు

తిరుపతి సిటీ : రాష్ట్రంలో ఉన్నత విద్యను కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేస్తోంది. పీజీ సెట్‌–2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియకు వచ్చిన దరఖాస్తులను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. గత ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో అడ్మిషన్లు కనీసం 50శాతం మించలేదు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణపై నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ ఏడాది వర్సిటీలలో కనీసం 20శాతం అడ్మిషన్లు దాటడమే గగనంగా మారింది. ఉన్నత విద్యామండలి నిర్ణయాల ఫలితంగా విద్యార్థులు పీజీపై అనాసక్తి చూపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 యూనివర్సిటీలలో సైన్స్‌, ఆర్ట్స్‌, కంప్యూటర్‌ విభాగాలలోని పీజీ కోర్సులల్లో సుమారు 32వేలకు పైగా సీట్లు ఉండగా ఇప్పటి వరకు కేవలం 9,765 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం గమనార్హం.

ఎస్వీయూ పరిధిలో వెయ్యిలోపే..!

పీజీ సెట్‌ కౌన్సెలింగ్‌ కోసం ఉన్నత విద్యామండలి సోమవారం వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు గడువు విధించింది. ఎస్వీయూ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో సుమారు 4వేల సీట్లు ఉండగా, ఇప్పటి వరకు కేవలం 955 దరఖాస్తులు మాత్రమే రావడం గమనార్హం. ఇలాంటి దుస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని విద్యార్థి సంఘాలు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీజీ కోర్సులను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో భాగంగానే ఉన్నత విద్యామండలి ఇలాంటి వాతావరణ కల్పించిందని ఆరోపిస్తున్నారు.

గడువు పెంచే ఆలోచనలో అధికారులు

పీజీసెట్‌–2025 రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు ఈ నెల 8 నుంచి 15 తేదీ వరకు ఉన్నత విద్యామండలి అనుమతించింది. అయితే ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో మరో మారు గడువు పెంచనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీలో కేవలం 15శాతం మాత్రమే దరఖాస్తులు రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు. కనీసం 50శాతం ప్రవేశాలను తీసుకురావాలని పీజీ సెట్‌ కన్వీనర్‌ను అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో పీజీ అడ్మిషన్లు చేపట్టలేమని ఎస్వీయూ మాత్రం చాకచక్యంగా చేతులెత్తేసింది. దీంతో ఉన్నత విద్యామండలి ఆ ప్రక్రియను నాగార్జున యూనివర్సిటీకి అప్పగించింది.

వర్సిటీల పరిస్థితి అగమ్య గోచరమే..!

గ్రామీణ, పేద, బడుగు బలహీన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే గత ఏడాది నుంచి అడ్మిషన్లు భారీ స్థాయిలో పడిపోతున్నాయి, ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్‌ వంటి కోర్సులకు క్రేజ్‌ తగ్గుతోంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌ షిప్‌లు, పరిశోధకలుకు ప్రొత్సాహాకాలు కల్పించకపోవడంతో విద్యార్థులు సాధారణ పీజీ కోర్సులపై మొగ్గు చూపడం లేదని స్పష్టమవుతోంది. దీంతో రాబోయే రోజులలో యూనివర్సిటీల మనుగడ పశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement