
ప్రశ్నించే గళంపై ప్రతీకారం
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోంది. చంద్రబాబుకు వ్యవస్థలను తన చేతుల్లోకి తీసుకుని ప్రశ్నించే గళంపై ప్రతీకారం తీర్చుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిలా ఉంటూ సమస్యలను ఎత్తిచూపుతూ వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న మీడియాపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. ప్రజలు హర్షించరు. ప్రభుత్వ వైఫల్యాలను సాక్షి పత్రిక ఎత్తిచూపుతోందని ఎడిటర్‌పై, విలేకరులపై అక్రమ కేసులు నమోదు చేసి కక్ష సాధింపు చర్యలకు దిగజారడం నీచ సంస్కృతికి నిదర్శనం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు దేశచరిత్రలో గతంలో చూడలేదు. సాక్షి పత్రికపై పక్షపాత ధోరణితో కేసులు బనాయించి, పోలీసులతో దాడులు చేయించి భయబ్రాంతులకు గురిచేయడం సరైన పద్ధతి కాదు. – భూమన కరుణాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు