ఇసుక దోపిడీ ? | - | Sakshi
Sakshi News home page

ఇసుక దోపిడీ ?

Sep 13 2025 7:33 AM | Updated on Sep 13 2025 7:33 AM

ఇసుక దోపిడీ ?

ఇసుక దోపిడీ ?

వారం రోజులుగా టిప్పర్లతో తరలింపు టిప్పర్‌ రూ.25 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న టీడీపీ నేత 300కు పైగా టిప్పర్‌ లోడ్లు అక్రమంగా డంపింగ్‌ ఇవేవీ పట్టనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు

హెరిటేజ్‌ పేరుతో

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపామని, అనధికారికంగా ఇసుక తరలింపును అరికట్టామంటూ ఉదరకొట్టే సీఎం చంద్రబాబు..హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి అక్రమంగా ఇసుకను తరలించడం చంద్రగిరి మండలంలో చర్చనీయాంశంగా మారింది. వారం రోజులుగా నిరంతరాయంగా భారీ యంత్రాలతో స్వర్ణముఖినదిని తోడేస్తూ వందల ట్రిప్పుల ఇసుకను తరలించేస్తు న్నారు. స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత అక్రమ రవాణా చేస్తుండడపై రైతులు మండిపడుతున్నారు.

స్థానిక రైతుల వివరాల మేరకు ఇలా...

చంద్రగిరి మండల పరిధిలోని కాశిపెంట్ల పంచాయతీ మొరవపల్లి స్వర్ణముఖినది పరివాహక ప్రాంతం ఉంది. వారం రోజులుగా సీఎం చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ ఫ్యాక్టరీ పేరుతో పలు సివిల్‌ పనులు జరుగుతున్నట్లు రైతులు చెబుతున్నారు. సివిల్‌ పనులకు అవసరమైన ఇసుకను సరఫరా చేసేందుకు స్థానికంగా ఉండే ఓ టీడీపీ నేత ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా రైతులు చెబుతున్నారు. తొలుత బోడంబాయి సమీపంలోని స్వర్ణముఖినది నుంచి భారీగా ఇసుకను తరలించేశారు. అనంతరం అక్కడ నుంచి వారం రోజులుగా మొరవపల్లి వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలోని ఇసుకను హిటాచీ సాయంతో ఇసుకను తోడేసి, తన పొలంలో అక్రమంగా డంపింగ్‌ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. రెండు రోజుల క్రితం స్థానిక రైతులకు చెందిన పంట పొలాలకు ఆనుకుని ఇసుకను తోడేయడంతో అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. తమ పంట పొలాలు దెబ్బతింటాయని, ఇసుక అక్రమ రవాణాను ఆపాలని లేకుంటే తమ పొలాలు వరదల సమయంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దర్జాగా డంపు చేసి..

సీఎం చంద్రబాబు సొంత మండలంలో భారీగా ఇసుక దోపిడీ జరుగుతుండడంపై రైతులు మండిపడుతున్నారు. పొలంలో ఇసుకను డంపు చేసి అక్కడ నుంచి టిప్పర్ల ద్వారా హెరిటేజ్‌ ఫ్యాక్టరీకి తరలిస్తున్నారని, ఇందు కోసం ఒక్కో టిప్పర్‌ ఇసుకను రూ.25 వేలకు విక్రయిస్తున్నట్లుగా రైతులు ఆరోపిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపామంటూనే, ఇలా హెరిటేజ్‌ ఫ్యాక్టరీ పేరుతో తెల్లబంగారాన్ని దోచేయడం ఏమిటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వందల టిప్పర్ల ఇసుకను తరలించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.కోటి రూపాయల విలువైన ఇసుకను డంపు చేశారని, హెరిటేజ్‌ ఫ్యాక్టరీ పేరుతో ఇతర ప్రాంతాలకు సైతం ఇసుకను రవాణా చేస్తూ రూ.కోట్లు వెనుకేసుకుంటున్నట్లుగా ఆరోపిస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు

హెరిటేజ్‌ ఫ్యాక్టరీ పేరుతో అక్రమంగా కోట్ల రూపాయల విలువైన తెల్ల బంగారాన్ని దోచుకెళ్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు చోద్యం చూడటంపై ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలతో వరదలు వస్తే తమ పొలాలకు ముంపు తప్పదని ఆందోళన చెందుతున్నారు.

– ఇసుక దోపిడీపై తహసీల్దార్‌ శివరామ సుబ్బయ్యను వివరణ కోరగా..టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా తమ దృష్టికి రాలేదని, వెంటనే సిబ్బందిని పంపించి అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement