
సదస్సు విజయవంతం చేద్దాం
తిరుపతి అర్బన్ : తిరుపతి వేదికగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా జిల్లాలో మహిళా సాధికారిత జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాం..జిల్లా యంత్రాంగం సమష్టిగా పనిచేసి విజయవంతం చేయాల్సి ఉందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ శుభం బన్స ల్, సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనా, డీఆర్వో నరసింహులుతో కలసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ సదస్సు డ్యూటీలకు వచ్చే ఉద్యోగులు సంప్రదాయబద్ధమైన దుస్తులను దరించిన రావాలని స్పష్టం చేశారు. ఆది, సోమవారాలు(14,15 తేదీల్లో) రెండు రోజుల పాటు సదస్సు ఉంటుందని వెల్లడించారు. తిరుచానూరు రాహుల్ కన్వెన్షన్ హాల్ నుంచి సీటింగ్, స్టేజ్ తదితర ఏర్పాట్లు ఓ క్రమ పద్ధతిలో ఉండేలా లోకసభ సెక్రటరీ బృందం తనిఖీ చేస్తుందని చెప్పారు. అలాగే చంద్రగిరికోట వద్ద అతిథులకు ఆతిథ్యం ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్, లోకసభ స్పీకర్, అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, రాష్ట్ర మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, పలువురు ప్రముఖులు రానున్నారని స్పష్టం చేశారు. మరోవైపు పోలీసు శాఖ నుంచి పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చూసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, రోజ్‌మాండ్, జిల్లా అధికారులు, నోడల్ అధికారులు, లైజన్ అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీతో కలిసి కలెక్టర్ సమీక్ష
కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి కలెక్టర్ పోలీసులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ నుంచి వీఐపీలు బస చేస్తున్న హోటల్స్ వరకే కాకుండా సమావేశం కానున్న తిరుచానూరు రాహు ల్ కన్వెన్షన్ సెంటర్ వద్ద, అలాగే చంద్రగిరి కోట వద్ద చేపట్టాల్సిన భద్రాతా అంశాలపై చర్చించారు.