
రూ.1500 ధర తగ్గిన 1010 వరి ధాన్యం
చిట్టమూరు : వర్షం కారణంగా మిల్లర్లు సిండికేట్ కావడంతో ఎండగారులో వరి ధాన్యం రెండు రోజుల్లో పుట్టి (1260 కేజీలు) రూ.1500 ధర తగ్గించి దళారులు కొనుగోలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం వరకు పుట్టి రూ15,500 ఉండగా శుక్రవారం రూ.14 వేలకు రైతుల వద్ద నుంచి ధాన్యం కొంటున్నారని వాపోయారు. ధాన్యం నిల్వ ఉంచుకోలేక దళారులు చెప్పిన రేటుకు అమ్ముకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు.
గంగ కాలువలో
గల్లంతైన వ్యక్తి మృతి
డక్కిలి : కండలేరు–పూండి కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి చెందిన సంఘటన డక్కి లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా.. గూడూరు రూరల్ మండలం చెన్నూరు గ్రామానికి చెందిన తిరుపతి మస్తాన్ (40), సమీప బంధువు బాలాజీ ఇద్దరు కలిసి గురువారం వెంకటగిరిలో జరిగిన పోలేరమ్మ జాతరకు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అక్కడి నుంచి డక్కిలి మండలం డీ వడ్డిపల్లి గ్రామంలో బంధువులు వద్దకు వెళ్లేందుకు వచ్చారు. డక్కిలిలోని మద్యం తీసుకుని తెలుగు గంగ కాలువ వద్దకు చేరుకుని ఇద్దరు మద్యం తాగారు. అయితే గంగ కాలువలో సరదాగా ఈత కోసం కాలువలోకి దిగారు. మస్తాన్‌కు ఈత రాకపోవడంతో గట్టు మీద కూర్చోగా బాలాజీ కాలువలోకి ఈత కొట్టేందుకు దూకాడు. వెంటనే మస్తాన్ కూడా కాలువలోకి ఒక్కసారిగా దూకేయడంతో గల్లంతయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ డక్కిలి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు, స్థానికులు గల్లంతైన మస్తాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. శుక్రవారం ఆల్తూరుపాడు గ్రామం వైపు వెళ్లే దగ్గర గంగ కాలువలో మృతదేహం లభ్యం అయింది. ఈ మేరకు డక్కిలి ఎస్‌ఐ కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

రూ.1500 ధర తగ్గిన 1010 వరి ధాన్యం