
శ్రీవారి సేవకుల సేవలు అమోఘం
●తిరుమల : తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో శుక్రవారం ఆమె అన్న ప్రసాదం స్వీకరించారు. ముందుగా అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర యల్లా, భానుప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం ఆమె భోజనశాల వద్దకు చేరుకుని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం ఆమె టీటీడీ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఇతర భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించడం హృదయానికి హత్తుకుందని పేర్కొన్నారు. అనంతరం ఆమె భక్తులతో ముచ్చటించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.