
లోక్‌సభ స్పీకర్ ఆలోచనతో శ్రీకారం
చంద్రగిరి : లోక్‌సభ స్పీకర్ ఆలోచనతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఏపీ శాసన సభ సెక్రటరీ జనరల్ సూర్య దేవర ప్రసన్న కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈనెల 14,15 న మహిళా సాధికారతపై పార్లమెంటు, శాసనసభ కమిటీల జాతీయ సదస్సు నిర్వహణపై చంద్రగిరి సమీపంలోని రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం ఆయన పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయా రాష్ట్రాల్లోని సమస్యలపై చర్చించకుండా దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఒకే వేదికపై చర్చించుకునేలా లోక్‌సభ స్పీకర్ ఈ ఏడాది నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. లోక్‌సభ మార్గదర్శకత్వంలో రెండు రోజుల పాటు సభలు నిర్వహించడం జరుగుతుందని, లోక్ సభ స్పీకర్ స్వయంగా ప్రారంభ సమావేశానికి, ముగింపు సమావేశానికి అధ్యక్షత వహిస్తారన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారన్నారు.
మొదటి రోజు హాజరుకానున్న లోక్‌సభ స్పీకర్
మొదటి రోజు 14వ తేదీన ఉదయం 10:30 గంటలకు రాహుల్ కన్వెన్షన్ హాల్‌లో సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రి చంద్రబాబు , రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరి వంశ్, శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు, రాష్ట్ర మంత్రులు, లోక సభ కమిటీ చైర్‌పర్సన్ పురందేశ్వరి, రాష్ట్ర కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరితారెడ్డి వేదిక పైనుంచి ప్రారంభ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ సభ స్పీకర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం చేస్తారన్నారు. 15న ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్ హాజరుకానున్నట్లు తెలిపారు.