
ఎర్ర చందనం కేసులో ఇద్దరికి జైలు
తిరుపతి లీగల్ : అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి, ఎర్ర చందనం దుంగలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన కేసులో ఇద్దరికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష, ఒక్కొక్కరికి ఆరు లక్షల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్ర చందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పు చెప్పారు. కోర్టు లైజిన్ ఆఫీసర్ రాజేష్ , కడప ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. 2019 ఆగస్టు 29వ తేదీ పోరుమామిళ్ల రేంజ్ , మల్లేపల్లి సెక్షన్‌లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, సిబ్బంది నిచ్చనిండ్ల అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. వైఎస్సార్ కడప జిల్లా బి.మఠం మండలం లింగాల దీన్నేపల్లికి చెందిన కప్పల రమేష్ , మల్లేపల్లికు చెందిన కోనేటి గురు ప్రసాద్ అలియాస్ దుబ్బోడు తదితరులు అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్ర చందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరి కొంతమంది అక్కడినుంచి పరారయ్యారు. ఆ ఇద్దరిని ఫారెస్ట్ సిబ్బంది విచారించగా ముదిరెడ్డిపల్లి బీట్ అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం దుంగలను దాచిపెట్టినట్టు అంగీకరించారన్నారు. ఫారెస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించగా 997 కిలోల 18 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను ఫారెస్ట్ సిబ్బంది అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం ఇద్దరిపై రుజువు కావడంతో ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.