
శెట్టిపల్లె భూ సమస్యపై పోరాటానికి సిద్ధం
తిరుపతి కల్చరల్ : శెట్టిపల్లె భూ సమస్య పరిష్కారానికి కమ్యూనిస్టులతో కలిసి పోరాడేందుకు సిద్ధమని వైఎస్సార్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి స్పష్టం చేశారు. వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం వేమన విజ్ఞాన కేంద్రంలో శెట్టిపల్లె భూ సమస్యపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అభినయ్ మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇప్పటికే సమస్య పరిష్కారానికి జీఓ జారీ చేశారన్నారు. ఈ మేరకు ప్రొసీడింగ్స్ కూడా జారీ కావడంతో రైతులు, ప్లాటు యజమానులు తమ హక్కులను క్లెయిమ్ చేసుకునే అవకాశం వచ్చిందని వివరించారు. ఇందులో మిగులు భూమిని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించాలని సూచించారు. బాధిత రైతుల విభాగం నేత బత్తినబాబు, ప్లాట్ల బాధిత విభాగం నేత రాధాకృష్ణ మాట్లాడుతూ ఏళ్ల తరబడి తమ భూమిని దక్కించుకునేందుకు యత్నిస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబును ఐదు సార్లు కలిసి తమ గోడు విన్నవించామని, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి అనేక సార్లు బాధను చెప్పుకునేందుకు యత్నిస్తే చీదరించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి అనేక సార్లు సమస్యను తీసుకెళ్లినా కాలయాపన చేయడం తప్ప చేసింది శూన్యమని వాపోయారు. ఇప్పటికే అనేక మంది బాధితులు కన్నుమూశారని తెలిపారు. కూటమి పాలనలో న్యాయం జరుగుతుందనే ఆశ లేదని, కనీసం ప్రతిపక్షాలైనా తమకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. వామపక్ష నేతలు వందవాసి నాగరాజు, పెంచలయ్య, ఆర్.హరికృష్ణ, పి.అంజయ్య మాట్లాడుతూ సుమారు 250 మంది రైతులు, 3 వేల మంది ప్లాట్ల యజమానులు ఇబ్బందిపడుతున్నారని వెల్లడించారు. పోరాటంతోనే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అనంతరం అఖిలపక్ష నేతలు పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు మల్లం రవిచంద్రారెడ్డి , ఆర్.వెంకటేశ్వర్లు, వాసు యాదవ్, రాజా, నాగిరెడ్డి ,పసుపులేటి సురేష్, ఇమ్రాన్ భాషా, దినేస్ ,యోగానందరెడ్డి, డీఎంసీ భాస్కర్, సీపీఐ నేత రాధాకృష్ణ, సీపీఎం నేత సుబ్రమణ్యం పాల్గొన్నారు.
తీర్మానాలు ఇవే..
పోరాటంలో భాగంగా ఈనెల 2న కలెక్టర్‌కు సామూహిక వినతి పత్రం సమర్పించనున్నారు. 4న కేబినెట్‌లో చర్చ లేకుంటే ఈనెల 6న కరపత్రాల పంపిణీ. 8 నుంచి 14వ తేదీ వరకు తుడా కార్యాలయం వద్ద నిరసన దీక్షలు. 15,16 తేదీల్లో 48 గంటల పాటు నిరవధిక దీక్షలు. అప్పటికీ స్పందించకపోతే ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు.