
చిచ్చు పెట్టిన నిమజ్జనం
తిరుపతి రూరల్ : వినాయక నిమజ్జనం దుర్గసముద్రం గ్రామంలో చిచ్చు పెట్టింది. గణపతి విగ్రహంతో వచ్చా రని దళితులపై టీడీపీ స్థానిక నేతలు సోమవారం ఉదయం గొడవకు దిగారు. అక్కడితో ఆగకుండా దళితుల ఇళ్లలోకి దూరి విచక్షణారహితంగా కొట్టారు. మహిళలు, పిల్లలనే తేడా లేకుండా బండరాళ్లు విసురుతూ భయానక వాతావరణం సృష్టించారు. దీనిపై సమాచారం అందుకున్న సీఐ చిన్నగోవిందు హుటాహుటిన గ్రామానికి వెళ్లి పచ్చమూకను చెదరగొట్టారు. గాయపడిన దళితులను ఆస్పత్రికి తరలించారు.
బాధితుల ఆగ్రహం
ఘటనాస్థలానికి వచ్చిన టీడీపీ నేత మునిశేఖర్‌ను దళితులు నిలదీశారు. ఇదేనా టీడీపీ ప్రభుత్వంలో మీరు చేస్తున్న మంచి అంటూ మండిపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.
పోలీసుల అదుపులో నిందితులు
దళితవాడపై జరిగిన దాడిలో ప్రధాన కారకులైన ఒంటెల గణేష్, మాకా హరీష్, మాకా మహేష్, విజయ్, భరత్, శ్రీకాంత్, గాజుల రవి ప్రకాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వీరితో పాటు తిరుపతి నగరం నుంచి దాడిలో పాల్గొన్న వారి వివరాలు సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే తమకు సమాచారం అందించాలని దళితవాడ వాసులకు సూచించారు.
పోలీస్ పికెటింగ్
దళితవాడలో ఘర్షణల నేపధ్యంలో పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డు చేసుకున్నారు. అలాగే ఘర్షణలకు పాల్పడిన వారి పేర్లును నమోదు చేసుకుని త్వరలో అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు.

చిచ్చు పెట్టిన నిమజ్జనం

చిచ్చు పెట్టిన నిమజ్జనం

చిచ్చు పెట్టిన నిమజ్జనం