
పరిశీలించి.. పరిష్కారం
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు జేసీతోపాటు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, డీఆర్‌ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కల్లెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్ మాండ్, సుధారాణి హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 195 వినతులు వచ్చినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే విభిన్న ప్రతిభావంతురాలైన ఎస్‌పీ షాజహన్‌కు రూ.12వేల విలువైన ట్రైసైకిల్‌ను జేసీ శుభం బన్సల్ అందించారు.
సీఎం పేరు చెప్పి కబ్జాలు
సీఎం చంద్రబాబుకు బంధువంటూ పవన్ అనే వ్యక్తి ఇష్టారాజ్యంగా భూములను కబ్జా చేస్తున్నారని సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కిరణ్‌కుమార్ మండిపడ్డారు. మఠం, తిరుపతి తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని భూములు, ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని సైతం ఆక్రమించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.ఉన్నతాధికారులు విచారణ చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు.