
94.56 శాతం పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్ : జిల్లావ్యాప్తంగా సోమవారం 94.56 శాతం మందికి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. మిగిలిన వారికి మంగళవారం అందించనున్నారు.
సంతాన సాఫల్య కేంద్రాలపై నిఘా
తిరుపతి తుడా: జిల్లాలోని సంతాన సాఫల్య కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీఎంహెచ్‌ఓ బాలకృష్ణనాయక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి పొందకుండా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహణ సాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా కేవలం 11 సెంటర్లు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. కొన్ని ఆస్పత్రులు ఐవీఎఫ్ సేవల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ మేరకు తనిఖీలు చేపట్టామని స్పష్టం చేశారు.
శ్రీవారి దర్శనానికి 4 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో ఒక్క కంపార్ట్‌మెంట్ మాత్రమే నిండింది. ఆదివారం అర్ధరాత్రి వరకు 70,310 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,866 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.49 కోట్ల ఆదాయం వచ్చింది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు ఉంటే 3 గంటల్లోనే దర్శనమవుతోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందు వెళితే క్యూలోకి అనుమతించమని స్పష్టం చేసింది.