
వ్యవసాయం.. అభివృద్ధే లక్ష్యం
చంద్రగిరి : వ్యవసాయ రంగం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ జయలక్ష్మీదేవి స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ఎస్వీ వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పలు బ్లాక్‌లను ప్రారంభించారు. అనంతరం స్వర్ణముఖి అతిథి గృహంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతులకు మంచి చేస్తూ, సాగును సంబరంగా మార్చేందుకే ఎన్‌జీ రంగా వర్సిటీ ఏర్పాటైందన్నారు. అందులో భాగంగా వివిధ పరిశోధనలు చేపట్టినట్లు, కొత్త ప్రాజెక్టులను అమలులోకి తీసుకువసున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగే వ్యవసాయ కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, డీన్ ఆఫ్ అగ్రికల్చర్, డీన్ ఆఫ్ అగ్రి ఇంజినీరింగ్, రిజిస్ట్రార్, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్, డీన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్, డీన్ స్టూడెంట్ అఫైర్స్ వంటి కీలక పదవులను నియమించినట్లు వివరించారు. వర్సిటీ నెలకొల్పి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాపట్ల, తిరుపతి వ్యవసాయ కళాశాలల్లో బాలికల వసతి గృహాల నిర్మాణానికి రూ. 3 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు వెల్లడించారు.