
ప్రపంచానికి ఆదిగురువు భారత్
– మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పెళ్లకూరు: సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన భారతదేశం ఒకప్పుడు ప్రపంచానికి ఆదిగురువు అని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. పెళ్లకూరులోని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు మన దేశంలో నలంద, తక్షశిల తదితర ప్రాంతాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో విదేశీయులు విద్యనభ్యసించారని గుర్తుచేశారు. ప్రపంచానికి మేధస్సును అందించిన మన సంప్రదాయాలను అందరూ పాటించాలన్నారు. లలితమ్మ విద్యావికాస్ ఉపకార వేతనం కింద ఇంటర్మీడియెట్ నుంచి బీటెక్ వరకు చదువుతున్న 58 మంది పేద విద్యార్థులకు రూ.25 వేల చొప్పున, 20 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ16.50 లక్షలను ట్రస్టీ చాగణం గౌరీశంకర్ సొంత నిధుల నుంచి వెంకయ్యనాయుడు చెక్కులు పంపిణీ చేశారు. లలితమ్మ జిమ్, పార్క్‌ను ప్రారంభించారు. స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్, ఉష, ఎమ్మెల్యే విజయశ్రీ, ట్రస్ట్ ప్రెసిడెంట్ చాగణం వరలక్ష్మి, సీఈవో పెనుబల్లి సీతారామయ్య, ట్రస్ట్ ప్రతినిధులు రాయసం హృషీకేశవ్, శ్రీలక్ష్మి, ఏవో కృష్ణ గల్లా, శ్రీవిన్య పాల్గొన్నారు