
టోల్‌తీస్తున్నారు!
ఏర్పేడు : నాయుడుపేట జాతీయ రహదారిలోని మేర్లపాక టోల్ గేట్ వద్ద సిబ్బంది నయా దందాకు తెరతీశారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. మేర్లపాక సమీపంలో మే 30వ తేదీన టోల్ గేటును ప్రారంభించారు. గేటు నిర్వహించే కర్నూలుకు చెందిన శ్రీ సాయి ఏజెన్సీ వారు 20 కిలోమీటర్లు పరిధిలోని స్థానికుల వాహనాలకు నెలకు రూ.350లతో టోల్ పాసులను అందించేవారు. అయితే ప్రస్తుతం టోల్ గేటు రుసుం వసూలు చేసే బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన ఇంద్రదీప్ ఇండియా లిమిటెడ్ చేపట్టింది. దీంతో స్థానికులకు ఇబ్బందులు మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం నెలవారీ పాసుల కోసం వాహనదారులు బారులు తీరారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆందోళన చేపట్టారు. దీంతో టోల్ గేట్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వాహనదారుల నుంచి కూడా రూ.201 చొప్పున ముక్కు పిండి వసూలు చేశారు. అధికారులు స్పందించి నెలవారీ పాసులు మంజూరు చేయాలని స్థానిక వాహనదారులు కోరుతున్నారు.