
నేడు బిల్లుల చెల్లింపునకు అవకాశం
చిత్తూరు కార్పొరేషన్ : ఆదివారం ప్రభుత్వ సెలవురోజు అయినప్పటికీ తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో విద్యుత్ బిల్లులు కట్టవచ్చని అధికారులు తెలిపారు. రెండు జిల్లాల్లోని అన్ని విద్యుత్ బిల్లుల కేంద్రాలు పనిచేస్తాయని చిత్తూరు, తిరుపతి జిల్లాల ట్రాన్స్‌కో ఎస్‌ఈలు ఇస్మాయిల్‌అహ్మద్, సురేంద్రనాయుడు తెలిపారు. వినియోగదారులు ఈ మార్పును గమనించాలని కోరారు. ముఖ్యంగా హెచ్‌టీ సర్వీసుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,576 మంది స్వామి వారిని దర్శించుకోగా 25,227 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్‌లోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.
ప్రసూతి ఆసుపత్రిలో
అరుదైన శస్త్రచికిత్స
తిరుపతి తుడా : స్థానిక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్సను వైద్యులు విజయవంతంగా చేశారు. వివరాలు ఇలా.. నెల్లూరుకు చెందిన వనిత (46) గర్భం ముఖద్వారం నందు 12–8 సి.ఎం పరిమాణం గల పెద్ద సైజు కణితి ఏర్పడింది. అరుదైన కణితిని ఆసుపత్రి వైద్యులు పలు పరీక్షలు నిర్వహించి చాకచక్యంగా తొలగించారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రమీల అభినందించారు.
29న రాయలసీమ డిపో మేనేజర్ల సదస్సు
తిరుపతి అర్బన్ : ఈనెల 29న తిరుపతిలోని భారతీ విద్యామందిరంలో నిర్వహిస్తున్న రాయలసీమ ఆర్టీసీ డీఎంల సదస్సుకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు హాజరు కానున్నారని జిల్లా ప్రజా రవాణా అధికారి జగదీష్ తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోని ఆర్టీసీ జోన్–4 పరిధిలోని 54 డిపోలకు చెందిన డీఎంలకు శనివారం సమాచారం అందించారు. జోన్–4 పరిధిలోని రాయలసీమ జిల్లాలకు చెందిన డిపో మేనేజర్లతో ఎండీ సమీక్షిస్తారని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించనున్నారని వివరించారు. 28న ఎండీ తిరుపతి జిల్లాలోని వాకాడు డిపోను పరిశీలన చేస్తారని, ఆ తర్వాత తిరుపతికి చేరుకుంటారన్నారు. అనంతరం 29న సదస్సులో పాల్గొంటారని తెలిపారు.