
జనవాసాల్లోకి చిరుతలు రాకుండా చర్యలు
● జూపార్క్ ప్రాంతాల్లో మూడు చిరుతల కదలికలు ● రాత్రివేళ్లల్లో ఒంటరిగా వెళ్లకూడదు ● వైల్డ్‌లైప్ సబ్ డీఎఫ్‌వో నాగభూషణం వెల్లడి
తిరుపతి మంగళం : శేషాచల అటవీ ప్రాంతం నుంచి చిరుతలు జనవాసాల్లోకి రాకుండా చర్యలు చేపడుతున్నామని తిరుపతి వైల్డ్ లైఫ్ సబ్ డీఎఫ్‌వో నాగభూషణం తెలిపారు. తిరుపతి కపిలతీర్థం సమీపంలోని అటవీశాఖ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీ జూపార్క్ రోడ్డులో నిన్నటి రాత్రి చిరుత సంచారం కలకలం రేపిందన్నారు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారుడిపై చిరుత దాడి చేసేందుకు యత్నించిందని తెలిపారు. అయితే అటు మార్గంలో రాత్రి సమయంలో వెళ్లే వాహనదారులు నలుగురు, ఐదుగురు అలిపిరి సర్కిల్ వద్ద నుంచి కలిసి వెళ్లాలని సూచించారు. ఎస్వీ జూపార్క్ రోడ్డులో అధికంగా ఫుడ్‌స్టాల్స్ ఉన్నాయని, వారు అక్కడే పడవేసే ఫుడ్‌వేస్టేజ్ కోసం కుక్కలు, పందులు, జింకలు వస్తుంటాయని, వాటి కోసం చిరుతలు అక్కడి వస్తున్నాయని తెలిపారు. ఫుడ్‌స్టాల్స్ నిర్వాహకులు వేస్టేజ్‌ను అక్కడ పడవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ రోడ్డు మార్గంలో ఫుడ్‌స్టాల్స్‌కు ఎలాంటి అనుమతి లేదని, వాటిని తొలగించేందుకు టీటీడీ అటవీ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాంతో పాటు ఎస్వీ యూనివర్సిటీ కళాశాల వద్ద గుట్టలుగా పడవేసే ఫుడ్ వ్యర్థాల కోసం ఇటీవల చిరుతలు ఆ ప్రాంతంలో సంచరించాయన్నారు. దాంతో అక్కడ బోను ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవడం జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం ఎస్వీ యూనివర్శిటీ, జూపార్క్ రోడ్డు ప్రాంతాల్లో మూడు చిరుతలు సంచరిస్తున్నట్లు సీసీ ఫుటేజ్‌ల ద్వారా తెలిసిందన్నారు. మూడు చిరుతలతో పాటు వాటి పిల్లలు కూడ ఉన్నట్లు గుర్తించామన్నారు. అలిపిరి సర్కిల్ వద్ద నుంచి రాత్రి వేళల్లో టీటీడీ, అటవీ శాఖ సిబ్బందిని ఏర్పాటు చేసి జూపార్క్ రోడ్డులో వాహనదారులను గుంపులుగా పంపేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే చిరుత కదలికలను తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలో 14 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఎస్వీ యూనివర్సిటీ, జూపార్క్ రోడ్డులో రెండు బోన్లును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చిరుతలు జనవాసాల్లోకి రాకుండా తగు చర్యలు చేపడుతున్నామన్నారు.
బోన్లు ఏర్పాటు
శేషాచల అడవుల్లో నుంచి జన వాసాల్లోకి వస్తున్న చిరుతలను పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తిరుపతి అటవీశాఖ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఎస్వీయూనివర్శిటీ ప్రాంతంలో రెండు బోన్లు, ఎస్వీ జూపార్క్ రోడ్డులోని అరవింద కంటి ఆసుపత్రి సమీపంలో ఒక బోను ఏర్పాటు చేశామని తెలిపారు.

జనవాసాల్లోకి చిరుతలు రాకుండా చర్యలు