
గాజులమండ్యంలో భూవివాదం
రేణిగుంట : మండలంలోని గాజుల మండ్యంలోని ప్రధాన రహదారికి ఆనుకొని గ్రామానికి చెందిన దొరై రాజుకు 1047 చదరపు అడుగుల స్థలం ఉంది. అందులో 927 చదరపు అడుగుల స్థలం తిరుపతి చైన్నె హైవే విస్తరణ కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నష్ట పరిహారం చెల్లించింది. హైవే పనులు పూర్తయిన అనంతరం మిగిలిన స్థలంలో షాప్ పెట్టుకోవాలని ఆ కుటుంబం ఎదురుచూస్తోంది. ఇంతలో వీరికి వెనుక నివాసం ఉన్న టీడీపీ నేత కన్ను ఆ స్థలంపై పడింది. ఆ స్థలాన్ని ఆక్రమిస్తే తన ఇల్లు రోడ్డుకు వస్తుందన్న దురాశతో రెండు నెలలుగా ఆ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ద్వారా అధికారులపై ఒత్తిడి తెచ్చి భూమిని సొంతం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ సీఐ మంజునాథరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి జేసీబీతో బాధితుడి స్థలంలో ఉన్న గోడను కూల్చేందుకు ప్రయత్నించారు. బాధితుడి భార్య మునెమ్మ జేసీబీకి అడ్డుగా కూర్చోవడంతో గ్రామస్తులు అధికారుల చర్యలను తప్పుపట్టి బాధితురాలికి అండగా నిలిచారు. బాధితుడి కుమారుడు మునేంద్ర మాట్లాడుతూ.. స్థలానికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయన్నారు. అధికార బలంతో ఆక్రమించాలని ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు.