
చిన్న వయస్సులోనే కుటుంబ భారం
తమ్ముళ్లు, చెల్లెలను కాపాడుకుంటున్న సోదరుడు
చిల్లకూరు : సాధారణంగా గిరిజనులు చిన్నప్పటి నుంచి ఎవరికి వారుగా జీవనం చేసుకునేందుకు భిక్షాటనను చేపట్టి ఇచ్చిన దాంతో తిని ఎక్కడ పడితే అక్కడ ఉండడం చేస్తుంటారు. అయితే గూడూరు మండలం విందూరు గిరిజన కాలనీకి చెందిన నలుగురు చిన్నారులు నిలువ నీడలేక పోయిన కాలనీలోనే పట్టలతో ఇంటిని నిర్మించుకుని గాలికి, వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఉంటున్నారు. వీరిలో అందరికన్నా పెద్దవాడు మూడో తరగతి వరకు చదువుకుంటున్న సమయంలో తండ్రి మృతి చెందడంతో మిగిలిన ముగ్గురి బాధ్యతను తీసుకుని చదువును వదిలి పనిబాట పట్టి వచ్చిన కూలీ డబ్బులతో ఇద్దరు తమ్ముళ్లతో పాటుగా చెల్లికి అండగా నిలుస్తున్నాడు.
ఈ క్రమంలో చిన్నారి చెల్లికి క్షయ వ్యాధి సోకిందని తెలిసి అల్లాడిపోతూ కూలీ డబ్బుల్లోనే చెల్లికి మందులు తీసుకుని వచ్చి ఒకరికి ఒకరు అండగా నిలుస్తున్నారు. గూడూరు మండలం విందూరు గ్రామంలోని గిరిజన కాలనికి చెందిన ఈశ్వరయ్య, పంరటమ్మ అనే గిరిజన దంపతులు ఉన్నారు. వీరికి 15 ఏళ్ల క్రితం తొలుత శివ అనే బాలుడు జన్మించాడు. అటు తరువాత మూడేళ్లకు వసంత అనే అమ్మాయి పుట్టింది. అటు తరువాత కవల పిల్లలుగా రామ, లక్షణ్ అనే జన్మించారు. అప్పట్లో ఆమె రక్తహీనత ఉండడంతో కొంత కాలానికి మృతి చెందింది.
అటు తరువాత బిడ్డలను తండ్రి ఈశ్వరయ్య చూసుకుంటూ పెద్ద వాడైన శివను బడికి పంపాడు. శివ మూడో తరగతిలో ఉన్నప్పడు తండ్రి కూడా కాలం చేశాడు. దీంతో నలుగురు పిల్లలు అనాథలయ్యారు. చెల్లి, తమ్ముళ్ల ఆకలితో అలమటించి పోతుండడంతో బడికి దూరమై కొద్ది రోజులు ఇంటింటికి వెళ్లి భోజనం తెచ్చి పెట్టేవాడు. ఇలా కుదరదని శివ కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బుతో తమ్ముళ్లు, చెల్లికి భోజనం పెట్టి చూసుకుంటున్నాడు.
అయితే చెల్లికి క్షయ వ్యాధి అని తెలియడంతో ఆ వచ్చిన డబ్బులతోనే మందులు తీసుకుని వచ్చి వాడుతున్నప్పటికీ నయం కాక పోవడంతో చెల్లి పరిస్థితి చూసి అల్లాడి పోతున్నాడు. ఇద్దరి తమ్ముళ్లను మంచి చదువులు చదివించాలని ఉందని గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఇద్దరిని మూడో తరగతి చదివిస్తున్నాడు. దాతలు ముందుకు వచ్చి బయట చదివించేందుకు సిద్ధమైనప్పటికీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక పోతున్నామని అందువల్ల గ్రామంలోనే ఉంటామని వాందరూ ఒకే మాట చెబుతున్నారు. ఐటీడీఏ అదికారులు వారి దీన స్థితిని గమనించి ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.