
సిబ్బందిని భర్తీ చేయాలని రైతుల నిరసన
వరదయ్యపాళెం : మండల వ్యవసాయ కార్యాలయంలో ఖాళీగా ఉన్న సిబ్బందిని తక్షణమే భర్తీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం మండల వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది లేని కారణంగా ఈ–క్రాప్ నమోదు సకాలంలో జరగడం లేదని రైతులు వాపోయారు. ఈ–క్రాప్ నమోదు కానందున రైతులు గిట్టుబాటు ధర కోల్పోతున్నారని ఆవేదన చెందారు. ప్రస్తుతం సీఎల్‌ఎన్‌పల్లి, ముస్లింపాళెం, మరదవాడ, లక్ష్మీపురం, కళత్తూరు ప్రాంతాల్లో వరి పంట సాగు చేసి ఉన్నారని, ఆ పంటకు సంబంధించి ఈ–క్రాప్ నమోదు చేయడంలో వ్యవసాయశాఖ అలసత్వం వహిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది కొరత కారణాన్ని చూపుతున్నారని రైతులు తెలిపారు. దీని వల్ల రైతులు ఒక్కో బస్తా మీద రూ. 300 వరకు రేటు కోల్పోయే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందారు. రైతు సేవా కేంద్రాలకు క్షేత్రస్థాయి సిబ్బందిని నియమింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తూ మండల వ్యవసాయశాఖ అధికారిణి గౌరికి వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో సీఎల్‌ఎన్‌పల్లి మాజీ సర్పంచ్ రవిరెడ్డి, మాజీ ఎంపీటీసీ మోహన్ తదితరులు ఉన్నారు.
రమణమూర్తికి పురస్కారం
చంద్రగిరి : తిరుపతిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాల గణాంక శాస్త్రం కంప్యూటర్ అనువర్తనాలు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ రమణమూర్తికి మెరిటోరియస్ టీచర్ అవార్డు లభించింది. ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం 57వ వార్షిక స్నాతకోత్సవం గురువారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా డాక్టర్ రమణమూర్తి మెరిటోరియస్ టీచర్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎంవీ రమణ, బోధనా, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
ఉల్లాస్–అక్షరాంధ్రను పటిష్టం చేద్దాం
తిరుపతి అర్బన్ : తిరుపతి జిల్లాలో ఉల్లాస్–అక్షరాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టం చేద్దామని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్ నుంచి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2029 నాటికి జిల్లాలో వంద శాతం అక్షరాస్యతను సాధించాలన్నారు. 2025–26లో జిల్లాలో 88,687 మంది నిరక్ష్యరాస్యులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని పేర్కొన్నారు. 2024–25లో 12,085 మందిని అక్ష్యరాస్యులుగా తయారు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా 15 –59 ఏళ్లలోపు మహిళలు, పురుషులకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం, డిజిటల్ అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యతపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఈ లక్ష్య సాధనలో అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని అక్ష్యరాస్యతను పెంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్య శాఖ అధికారి మహమ్మద్ ఆజాద్, జిల్లా వయోజన శాఖ నోడల్ అధికారి ప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, మెప్మా పీడీ రవీంద్ర, డ్వామా పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈవో కేవీఎన్ కుమార్, ఐసీడీఎస్ పీడీ వసంతబాయి పాల్గొన్నారు.
ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు
– మానవత్వం చాటిన కలువాయి జెడ్పీటీసీ
కలువాయి(సైదాపురం) : ఆటో బోల్తా పడిన ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడటంతో అటు వైపు వెళుతున్న కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్‌కుమార్‌రెడ్డి స్పందించి గాయపడిన మహిళలను ఆస్పత్రిలో చేర్పించి.. మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మండలంలోని తోపుగుంట సమీపంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల మేరకు.. మండలంలోని తోపుగుంట సమీపంలో ఓ ఆటో బోల్తా పడటంతో అందులోంచి వెంకటరెడ్డిపల్లికి చెందిన జంగాల కాలనీకి చెందిన విభూధి పుల్లమ్మ తీవ్రంగా గాయపడింది. ఆ సమయంలోనే అటు వైపు వెళుతున్న కలువాయి జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలం వద్ద ఆగి ఆటోను పక్కకు తీసియించారు. 108కు కాల్ చేయగా ఆ వాహనం మరమ్మతులకు గురి అయిందంటూ సమాచారం అందజేయడంతో మరో ఆటో ద్వారా గాయపడిన మహిళను ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ కోటయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

సిబ్బందిని భర్తీ చేయాలని రైతుల నిరసన

సిబ్బందిని భర్తీ చేయాలని రైతుల నిరసన