
అత్తతో పాటు భార్యనూ కడతేర్చేందుకు వ్యూహం
నాయుడుపేటటౌన్ : భార్య కాపురానికి రాలేదని దీనికి అడ్డుగా ఉన్న అత్త సగటూరు చెంగమ్మ(47)తో పాటు భార్య స్వాతిని హత్య చేసేందుకు భర్త బోడెద్దుల వెంకయ్య పథకం రూపొందించుకున్నట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించారు. పోలీసుల కథనం మేరకు.. వెంకయ్య పథకం ప్రకారమే మంగళవారం నెల్లూరులోని కుమార్తె ఇంటి వద్ద ఉన్న అత్త చెంగమ్మకు ఫోన్ చేసి తాను పురుగుమందు తాగి చనిపోతున్నట్లు చెప్పాడన్నారు. దీంతో చెంగమ్మ నెల్లూరు నుంచి బయలు దేరి మంగళవారం మధ్యాహ్నం పండ్లూరు గ్రామం వద్ద దిగి అక్కడ నుంచి ఆటోలో వచ్చి తుమ్మూరు గ్రామ స్వర్ణముఖి నది బ్రిడ్జి సమీపంలోని నది కట్ట మీద నిలబడి ఉన్న అల్లుడు వెంకయ్య వద్దకు చెంగమ్మ చేరుకున్నట్లు తెలిపారు. ఆమైపె కోపంతో ఉన్న వెంకయ్య ఒక్కసారిగా అతడి వద్ద ఉన్న కత్తితో అత్తను కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నది కట్టపై నుంచి చెంగమ్మ మృతదేహాన్ని కిందకు తోసేసి తిరిగీ పండ్లూరు గ్రామానికి వచ్చి పార తీసుకుని రాత్రి స్వర్ణముఖి నది వద్దకు వెళ్లి చెంగమ్మ మృతదేహాన్ని నదిలో పూడ్చి పెట్టాడన్నారు. మంగళవారం రాత్రి అయ్యప్పరెడ్డి పాళెం గ్రామంలోని చెంగమ్మ ఇంటి వద్దకు వచ్చి భార్య స్వాతి కోసం వెతికాడన్నారు. భార్య ఇంటి వద్ద ఉండి ఉంటే ఆమెను కూడా హత్య చేసేవాడని పోలీసులు తెలిపారు. వెంకయ్యను బుధవారం ఉదయం గ్రామస్తులు పట్టుకుని నిలదీయడంతో జరిగిన విషాయాన్ని వెల్లడించినట్లు మృతురాలి కుమార్తెలు స్వాతి , అనిత, సుకన్యతో పాటు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ముఖ్యంగా వెంకయ్యతో పాటు మరో ఇద్దరు లేక ముగ్గురు కలిసి చెంగమ్మను హత్య చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తూ సీఐ బాబికి వారు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు చెంగమ్మ హత్యపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. నిందితుడు వెంకయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వెల్లడించారు.
కుటుంబ సభ్యుల రోదనలు
అల్లుడి చేతిలో హత్యకు గురైన అత్త చెంగమ్మ మృతదేహానికి పోస్టుమార్టం జరిపి గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో మృతదేహానికి పోస్టుమార్టం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.