90 లక్షల పొదుపు డబ్బులు స్వాహా | - | Sakshi
Sakshi News home page

90 లక్షల పొదుపు డబ్బులు స్వాహా

Jul 26 2025 9:38 AM | Updated on Jul 26 2025 10:14 AM

90 లక్షల పొదుపు డబ్బులు స్వాహా

90 లక్షల పొదుపు డబ్బులు స్వాహా

● మెప్మాలో మేత ● విచారణలో బయటపడిన ఆర్పీ హేమలత అక్రమాలు ● సంఘాల డబ్బు బ్యాంకులో పొదుపు చేయకుండా చేతివాటం ● బ్యాంకు సిబ్బందితో కుమ్మక్కు ● నకిలీ రసీదులతో మోసం ● 33 పొదుపు సంఘాలకు టోకరా

తిరుపతి తుడా : తిరుపతి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి జలగ బండారం బయట పడింది. ఆర్పీ అక్రమాలు తొలుత రూ.70 లక్షలని ఆరోపణలు వచ్చినా ఆ మొత్తం ఇప్పుడు 90 లక్షలకు తేలింది. తిరుపతి మెప్మా భాగ్యలక్ష్మి స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ హేమలత పై వచ్చిన ఆరోపణలతో మెప్మా డైరెక్టర్‌ విచారణ కమిటీని నియమించారు. వారం రోజులపాటు ఈ కమిటీ లోతుగా విచారణ చేపట్టగా ఆమె డ్వాక్రా సంఘాల ద్వారా నొక్కేసి మెక్కిన మొత్తం రూ.90 లక్షలని తేలింది. ఈ మేరకు శుక్రవారం కమిటీ విచారణలో తేలిన వివరాలను మీడియాకు వివరించారు.

అక్రమాలెన్నో..

భాగ్యలక్ష్మి స్లమ్‌ లెవెల్‌ ఫెడరేషన్‌ రిసోర్స్‌ పర్సన్‌ అక్రమాలు తవ్వేకొద్ది అనేకం వెలుగులోకి వచ్చాయి. డ్వాక్రా మహిళల సొమ్మును నొక్కేసేందుకు ఆమె అనేక ఎత్తులు వేశారని బహిర్గతమైంది. భాగ్యలక్ష్మి ఎస్‌ఎల్‌ఎఫ్‌ ఆర్పీగా ఉన్న హేమలత 33 పొదుపు సంఘాల సొమ్ము లావాదేవీలను పర్యవేక్షిస్తుంది. ఈ పొదుపు సంఘాలకు సంబంధించి నెలవారీ పొదుపు మొత్తం, రుణాల రికవరీ డబ్బులను బ్యాంకులోకి జమ చేయకుండా సొంతానికి వాడుకున్నారు. బ్యాంకులో ఈ నగదును చెల్లించినట్లు నకిలీ రశీదులను చూపిస్తూ మాయ చేస్తూ వచ్చింది. ఈ విషయం బ్యాంకు నుంచి బయటకు రాకుండా అక్కడ సిబ్బందితో కుమ్మకై ్కంది. కొన్ని నెలల పాటు డ్వాక్రా మహిళలు, బ్యాంక్‌ సిబ్బందిని మేనేజ్‌ చేస్తూ అక్రమాలకు పాల్పడింది. 33 సంఘాలకు సంబంధించి చేసిన మోసం రూ.90 లక్షల మేర ఉందని విచారణలో తేలింది. విచారణ కమిటీ సభ్యులు ఆర్పీ పరిధిలోని రికార్డులు, బ్యాంక్‌ లావాదేవీలు, సభ్యుల రిజిస్టర్లు, పొదుపు పుస్తకాలు క్షుణ్ణంగా పరిశీలించగా ఈ మొత్తాన్ని కాజేసినట్లు తేల్చారు. పక్కా ప్రణాళికలతోనే అందర్నీ మోసం చేస్తూ ఆమె పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిందని నిర్ధారణ చేశారు.

వెలుగు చూసింది ఇలా....

ఆర్పీ హేమలత పరిధిలోని ఓ సంఘం సభ్యులు నెలవారి రుణాలను పక్కాగా చెల్లిస్తూ వచ్చారు. మరోసారి రుణం తీసుకోవాలని ఆ సంఘం సభ్యులు నిర్ణయానికి వచ్చారు. ఆర్పీ నెలల తరబడి ఆ సంఘం లీడర్లను బ్యాంకు వైపు వెళ్లకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. రుణాలు ఎందుకు రావడం లేదో తెలుసుకునేందుకు ఆ సంఘం లీడర్లు బ్యాంకు వద్దకు వెళ్లారు. తమ సంఘానికి రూ.20 లక్షల రుణం కావాలని బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించారు. రికార్డులను పరిశీలించిన బ్యాంకు మేనేజర్‌ గతంలో తీసుకున్న మొత్తం ఇంకా చెల్లించలేదని, మీకు కొత్త రుణం ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడంతో వారు అవాక్కయ్యారు. నెలవారిగా క్రమం తప్పకుండా పొదుపు, రుణ చెల్లింపులు చేశామని ఇందుకు సంబంధించిన రసీదులు ఉన్నాయని మేనేజర్‌కి చూపించగా అవి నకిలీవని తేల్చారు. దీంతో మోసపోయామంటూ ఆర్పీ హేమలతను నిలదీశారు. ఇలా మొత్తం 33 సంఘాల పరిధిలో 27 సంఘాలకు సంబంధించి హేమలత చేసిన అక్రమాలు బయటపడ్డాయి.

బాండ్లు రాయించి చెల్లించేలా ఒప్పందం

హేమలత అవినీతి అక్రమాలు నిర్ధారణ కావడంతో ఎట్టకేలకు ఆమె తాను డ్వాక్రా సొమ్ము కాజేశానని అంగీకారం తెలిపారు. తాను కాజేసిన మొత్తం వివరాలను, మొత్తం తిరిగి చెల్లిస్తానని సంఘాలకు సైతం అంగీకార పత్రాన్ని రాసిచ్చారు. నిర్ధారణ ప్రకారం ఏ సంఘానికి ఎంత డబ్బు ఇవ్వాలి అన్న వివరాలతో బాండ్లు, చెక్కులను రాసిచ్చారు.

ఆర్పీ అవినీతితో ఉలిక్కిపడ్డ తిరుపతి

ఒక ఆర్పీ రూ. 90 లక్షల మేర అవినీతికి పాల్పడిందని నిర్ధారణ కావడంతో తిరుపతి ఉలిక్కిపడింది. తిరుపతి పరిధిలో సుమారు 47 వేల మందికి పైగా డ్వాక్రా సంఘ సభ్యులు ఉన్నారు. ఆర్పీ అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. వందల మంది కళ్ళు గప్పి బ్యాంకును సైతం మోసగించిన తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. తమ సంఘాల పరిధిలో ఏమైనా అక్రమాలు జరిగాయా అంటూ మిగిలిన పొదుపు సంఘాలు ఆరా తీసేపనిలో పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement