గోపాలన్నా.. నీబిడ్డకు బుద్ది ప్రసాదించిన్నా.. | - | Sakshi
Sakshi News home page

గోపాలన్నా.. నీబిడ్డకు బుద్ది ప్రసాదించిన్నా..

Jul 26 2025 9:38 AM | Updated on Jul 26 2025 10:53 AM

-

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : ప్రపంచ దేశాలు ఆధ్యాత్మిక నగరమని గొప్పగా చెప్పుకునే తిరుపతి నగరంతో పాటు నగర శివార్లలో గంజాయి దందా గుట్టుగా సాగుతోంది. ఒక్క గంజాయే కాదు మత్తు ఎక్కించే మాదక ద్రవ్యాలు ఎన్నో యువత భవితను చిత్తు చేస్తున్నాయి.. నిన్న, మొన్నటి వరకు వైట్‌నర్‌, ఫ్లూయిడ్స్‌ను ఉపయోగించి మత్తులోకి వెళుతున్న యువత తాజాగా మత్తును కలిగించే ఇంజెక్షన్లకు అలవాటు పడుతున్నారు. గంజాయి దొరకలేదంటే మత్తు కోసం తహతహలాడే కుర్రాళ్లు మత్తు ఇంజెక్షన్లతో సరిపెట్టుకుంటున్నారు. గంజాయి బ్యాచ్‌ మాత్రం యువకులనే టార్గెట్‌గా పెట్టుకుని గుట్టుగా అమ్మకాలు చేస్తోంది. మత్తుకు బానిసలైన యువకులకు గంజాయి ఆశ చూపించి పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. మత్తుకు బానిసలైన కుర్రాళ్లు ఎంతకై నా తెగించేస్తున్నారు. హత్యలు, హత్యాచారాలు, అఘాయిత్యాలకు పాల్పడుతూ భయానక వాతావరణం తీసుకొస్తున్నారు.. గంజాయి ముఠాలకు రాజకీయ నేతలు అండగా నిలుస్తుండటంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక వెనుదిరుగుతున్నారు.. ఒక దశలో గంజాయి బ్యాచ్‌ పోలీసులపైకే తిరగబడుతున్నట్టు సమాచారం. గంజాయి ముఠా పట్ల పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపితే తప్ప తిరుపతికున్న పరపతిని కాపాడలేరన్న మాట అందరి నోట వినిపిస్తోంది.

గంజాయి బ్యాచ్‌ ఉండేది...

తిరుపతి నగరంతో పాటు నగరానికి ఆనుకుని ఉన్న మఠం భూములు, కాలువ భూములు, చెరువులు, పాడుబడిన భవంతుల్లో గంజాయి ముఠాలు తిష్ట వేసినట్టుగా సమాచారం. దామినేడు, బాలాజీ డెయిరీ, పాడిపేట ప్రాంతాల్లో నిరుపేదలకు నిర్మించిన ఇందరమ్మ గృహాలు, రాజీవ్‌ గృహాల్లో గంజాయి బ్యాచ్‌ తలదాచుకుంటున్నట్టు సమాచారం. పోలీసులు పలుమార్లు ఆ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన గంజాయి బ్యాచ్‌ మాత్రం పట్టుబడలేదంటే ఏ స్థాయిలో వారికి సమాచారం అందుతుందో అర్థం చేసుకోవచ్చు. మత్తుకు బానిసలైన యువత అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ కిడ్నాప్‌లు, హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నా పోలీసులు వారిని పట్టుకునేందుకు సాహసించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తిరుపతి నగరంతో పాటు నగర శివార్లలో ఉన్న పోలీస్‌ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి గంజాయి బ్యాచ్‌ నుంచి బెదిరింపులు కూడా వస్తున్నట్లు సమాచారం.

కార్లు, అంబులెన్స్‌లు, రైళ్లలో తరలింపు

తిరుపతికి సమీపంలోని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి గంజాయిని తరలించేందుకు అక్రమార్కులు కార్లు, అంబులెన్స్‌లు, రైళ్లను వాడుకుంటున్నట్టు సమాచారం. రైల్వే పోలీసుల కళ్లు గప్పి గంజాయిని గుట్టుగా తీసుకురావడం, అంబులెన్స్‌ డ్రైవర్లకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి గంజాయి ప్యాకెట్లను అక్రమార్కులు అనుకున్న ప్రాంతాలకు చేరుస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి అక్రమ రవాణాకు జాతీయ రహదారిని మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జాతీయ రహదారిపై రాత్రివేళ వాహనాల తనిఖీ జరగదన్న తలంపుతో ఆ మార్గాన్ని గంజాయి వ్యాపారులు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాక హైవే పెట్రోలింగ్‌ వ్యవస్థ లేకపోవడంతో అక్రమార్కులు తమ అక్రమాలకు రాచబాటగా చేసుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జూలై 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నాలుగు ప్రాంతాల్లో గంజాయిని పెద్ద ఎత్తున పట్టుకున్నారంటే ఏ స్థాయిలో అక్రమ వ్యాపారాలు సాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. శ్రీవారి పాదాల చెంత ప్రశాంతంగా ఉండాల్సిన తిరుపతి నగరం, పరిసర ప్రాంతాలు మత్తు పదార్థాల అలజడితో వణుకుతోందని చెప్పక తప్పదు.

పాడుబడ్డ గృహాలే ముఠాకు అడ్డా

తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌, తిరుచానూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ఇందిరమ్మ, రాజీవ్‌ గృహకల్ప పథకం కింద నిర్మించిన భవన సముదాయాల్లో పాడుబడ్డ గృహాలనే గంజాయి ముఠా అడ్డాగా చేసుకున్నట్టు సమాచారం. ఇటీవల గంజాయి బ్యాచ్‌ చేస్తున్న అకృత్యాలు, అఘాయిత్యాలకు నగరవాసులే కాదు, శ్రీవారి భక్తులు సైతం రాత్రివేళ భయంభయంగా తిరిగే పరిస్థితి దాపురించింది. జాతీయ రహదారితో పాటు నిర్మానుష ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకున్న గంజాయి ముఠా పగలంతా ఎవరెవ్వరికి విక్రయించాలో గుర్తించి రాత్రిపూట గుట్టుగా తరలించేస్తున్నట్టు సమాచారం. పోలీసుల కళ్లు గప్పి అమ్మకాలు సాగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గంజాయి ముఠా నివాసముంటున్న పాత భవనాలకు వెళ్లే దారుల్లో వీధి దీపాలను పగులగొట్టేస్తుండడంతో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు దీపాలు ఏర్పాటు చేయడం మానేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే రాత్రి వేళల్లో పోలీసులు డ్రోన్‌ల సాయంతో అసాంఘిక శక్తులను పట్టుకుంటామని పంపించే డ్రోన్‌లకు చిక్కకుండా పాడుబడిన ఇళ్లను అడ్డాగా చేసుకున్నట్టు సమాచారం.

గోపాలన్నా.. నీబిడ్డకు బుద్ది ప్రసాదించిన్నా..1
1/1

గోపాలన్నా.. నీబిడ్డకు బుద్ది ప్రసాదించిన్నా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement