
యువతకు నీలం సంజీవరెడ్డి ఆదర్శం
తిరుపతి సిటీ : నైతికత, విలువలతో కూడిన నాయకత్వం, నిజాయతీ, ప్రజాసేవ నీలం సంజీవరెడ్డి సొంతమని ఆయన నేటి యువతకు ఆదర్శమని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరామిరెడ్డి కొనియాడారు. ఎస్వీయూ రాజనీతి, పాలనాశాస్త్ర విభాగం సహకారంతో అగ్రశ్రీ సంస్థ ఆధ్వర్యంలో వర్సిటీ సెనేట్ హాల్‌లో శుక్రవారం నీలం సంజీవరెడ్డి 3వ స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ ముఖ్యమంత్రిగా వ్యవసాయ ఆవశ్యకతను తెలుసుకుని గ్రామీణ, వ్యవసాయ పురోగతికి ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు.ఎస్వీయూ వీసీ అప్పారావు మాట్లాడుతూ.. డాక్టర్ నీలం సంజీవరెడ్డి దూరదృష్టితో స్థాపించిన ఎస్వీయూ వేల మంది విద్యావేత్తలను, ప్రజా నాయకులను తయారు చేసిందన్నారు.అనంతరం రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ యతిరాజులు మాట్లాడుతూ.. డాక్టర్ నీలం సంజీవరెడ్డి పేరిట రాష్ట్ర పురస్కారాలను ఏర్పాటు చేసి ఏటా కార్యక్రమాలను నిర్వహిస్తున్న అగ్రశ్రీ సంస్థకు ఆర్థికంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సహరించాలని సూచించారు. అనంతరం నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కారాలను అందజేశారు. విశిష్టరత్న పురస్కారాన్ని ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట్రామిరెడ్డికి, న్యాయ శిరోమణిని మాజీ న్యాయమూర్తి జస్టిస్ శేషసైనారెడ్డికి, విద్యాశిరోమణిని గీతం వర్సిటీ మాజీ వీసీ దయానంద్‌కు, వైద్య శిరోమణి పురస్కారాన్ని ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పూర్ణచంద్‌కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలం సంజీవరెడ్డి రాష్ట్ర పురస్కార గ్రహీతల గౌరవార్థం అగ్రశ్రీ సంస్థ ప్రచురించిన విశేష సంచికను అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు అగ్రశ్రీ సంస్థ సంచాలకులు డాక్టర్ డి సుందరరామ్, ఉపాధ్యక్షుడు సాయి కుమార్, ప్రొఫెసర్ మురళీధర్, మళ్లీశ్వరరావు, పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు.