
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
తిరుపతి రూరల్ : యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు భద్రతను ఉంచినట్లు జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు వెల్లడించారు. ఆదివారం తిరుపతి కేంద్రంగా జరిగే పరీక్షా కేంద్రాలు, అక్కడ చేపట్టిన భద్రతా చర్యలపై శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో యూపీఎస్సీ అబ్జర్వర్ శైలేష్‌గౌతమ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుపతి జిల్లాలోని 3 పరీక్ష కేంద్రాలలో 1,052 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు, లైజన్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఉదయం 09:30 గంటల నుంచి 11:30 గంటల వరకు పేపర్ –1, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్–2 పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని లేకపోతే పరీక్ష కేంద్రానికి అనుమతించబోమని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్దకు ఆర్టీసీ సౌకర్యం, కేంద్రాల వద్ద సౌకర్యాలు , విద్యుత్తు అంతరాయం లేకుండా సంబంధిత శాఖల అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పరీక్షా కేంద్రాల వివరాలు
తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీ నుంచి వెస్ట్ చర్చికి వెళ్లే దారిలో ఉన్న శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల, శ్రీ పద్మావతీ గెస్ట్ హౌస్ నుంచి రైల్వే ట్రాక్ దాటుకుని వెళ్లే మార్గంలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ, శ్రీ పద్మావతీ జూనియర్ కాలేజీలను పరీక్ష కేంద్రాలుగా అధికారులు నిర్ధేశించారు. పరీక్ష నిర్వహించే ఆ ప్రాంతంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు హెచ్చరించారు.