
ఐఐటీ పట్టభద్రుల పట్టాభిషేకం
418 మందికి పట్టాలతో సత్కారం
స్నాతకోత్సవంలో ఐఐటీలో చదివిన మొత్తం 418 మంది విద్యార్థులకు ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ చేతుల మీదుగా పట్టాలను అందించి ఘనంగా సత్కరించారు. అందులో మొత్తం 212 మంది విద్యార్థులకు బీటెక్ డిగ్రీ పట్టాలు, 91 మందికి ఎంటెక్ డిగ్రీ పట్టాలు, 53 మందికి ఎంఎస్సీ డిగ్రీ పట్టాలు, 16 మందికి ఎంపీపీ డిగ్రీ పట్టాలు, 13 మందికి ఎంఎస్ (రీసెర్చ్) డిగ్రీ పట్టాలు, 28 మందికి పీహెచ్‌డీ డిగ్రీ పట్టాలు, ఒకరికి ఎంటెక్, పీహెచ్‌డీ డ్యూయెల్ డిగ్రీ పట్టా, ఒకరికి డిప్లొమా పట్టా, మరొకరికి సర్టిఫికెట్ ఆప్ ఫౌండేషన్ పట్టాలను ప్రదానం చేశారు. విద్యార్థులు పట్టాలు అందుకుంటుండగా సభికులు కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు.
● అట్టహాసంగా తిరుపతి
ఐఐటీ 7వ స్నాతకోత్సవం
● కుటుంబ సభ్యులు, స్నేహితుల
ఆనందోత్సవాలు
ఏర్పేడు : వారంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన అత్యున్నత ప్రతిభావంతులు... ప్రఖ్యాత జాతీయ విద్యాసంస్థ శ్రీఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి ప్రాంగణంలో సీటు సంపాదించి దిగ్విజయంగా కోర్సును పూర్తి చేశారు. ఏళ్ల తరబడి తాము పుస్తకాలతో కట్టిన దోస్తీ.. మెదడులో కదలాడిన విభిన్న ఆలోచనలతో ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికారు.. తాము ఎంచుకున్న కోర్సులో అత్యుత్తమ ప్రతిభను కనబరచి గొప్ప మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. కష్టానికి తగిన ప్రతిఫలం అందుకునేందుకు తెల్లకోటు ధరించి..తిరుపతి ఐఐటీ లోగోతో కూడిన వస్త్రాన్ని కప్పుకుని తల్లిదండ్రులు, ఆప్తులు, అనుయాయుల కరతాళ ధ్వనుల మధ్య ఆచార్యుల చేతుల మీదుగా అందుకున్న ‘పట్టా’ వారందరిని ఆనందంలో ముంచెత్తింది. పట్టాను అందుకుని భవిష్యత్తులో తాను చేరాల్సిన గమ్యాన్ని మదిలో తలచుకుని సంతోషంలో మునిగితేలారు. ఆదివారం సాయంత్రం జరిగిన తిరుపతి ఐఐటీ 7వ స్నాతకోత్సవ వేడుక వారందరి జీవితాల్లో ఓ మరపురాని ఘట్టంగా నిలిచింది.
ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో ఆదివారం సాయంత్రం ఐఐటీ డైరెక్టర్ డాక్టర్ కెఎన్ సత్యనారాయణ అధ్యక్షతన 7వ స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రియా యూనివర్శటీ చాన్సలర్, కాగ్నిజెంట్ కో ఫౌండర్ లక్ష్మీనారాయణన్, జేఎస్‌డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏర్పేడు సమీపంలోని శాశ్వత ప్రాంగణంలో నడుపుతున్న ఐఐటీలోని వసతులు, కోర్సులలో ఉన్న విద్యార్థులు, సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లను గురించి వివరించారు. స్నాతకోత్సవ వేడుకలో విద్యార్థులతో కలసి పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కోర్సు పూర్తి చేసుకుని బయటకు వెళ్లనున్న విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగానికి ఉన్న ప్రాధాన్యం గుర్తించి అవకాశాలను అందిపుచ్చుకుని గొప్ప ఆవిష్కర్తలుగా మారి దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. ముఖ్య అతిథి లక్ష్మీనారాయణన్ మాట్లాడుతూ.. గొప్ప ఇంజినీర్లుగా రాణించి నూతన ఆవిష్కరణలతో దేశాన్ని ముందు వరుసలో నిలపాలన్నారు. జీవితంలో ప్రతి దశలోనూ సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన ఎంతో అవసరమన్నారు. ప్రణాళికతో కూడిన కఠోర శ్రమతోనే పోటీ ప్రపంచంలో రాణించగలుగుతారన్నారు.
ప్రెసిడెంట్, గవర్నర్ పతకాలు ప్రదానం
తిరుపతి ఐఐటీలో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు సర్వతోముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలను ప్రదానం చేశారు. బీటెక్ (సీఎస్‌ఈ) విద్యార్థి అరవింద్ శ్రీనివాసన్‌కు బెస్ట్ అకడమిక్ పెర్ఫామెన్స్ ఇన్ ద బీటెక్ ప్రోగ్రాం కింద స్నాతకోత్సవ సభలో ప్రెసిడెంట్ మెడల్, బంగారు పతకం అందించి సత్కరించారు. అలాగే ఆల్‌రౌండ్ ప్రొఫెసియెన్సీ ఇన్‌రికులర్, ఎక్స్‌ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇన్ బీటెక్ ప్రోగ్రాంలో ప్రతిభను కనబరిచిన బీటెక్(కెమికల్ ఇంజనీరింగ్) విద్యార్థిని మేఘవర్షిణి గవర్నర్ పతకంతో సత్కరించారు. మేఘవర్షిణి కమతం కృష్ణయ్య అవార్డును కూడా అందుకున్నారు. అలాగే ఆర్వీ అసోసియేట్ ప్రైజ్‌ను కొత్తపల్లి ఈశ్వర్ వెంకటసాయి వర్మ, ఫస్ట్ డీన్ ప్రైజ్‌ను షేక్ మహ్మద్ అల్లాబక్షి ఇన్‌స్టిట్యూట్ ప్రైజును పింకేష్‌కుమార్ మిశ్రా, అరవింద్ శ్రీనివాసన్, టి.ఆదిత్యన్, గౌరవ్ త్రిపాఠి, బి.గాయత్రి, కె.మదన్‌మోహన్, జయదీప్‌రాయ్, రితిక్ మండల్, అమరరాజ ప్రైజ్‌ను సుధాకర్ వెంకటాచలం, ఐటీసీ లిమిటెడ్ ప్రైజ్‌ను శృతి షజి, రామకృష్ణన్ అండ్ లక్ష్మీకాంతన్ మెమోరియల్ ప్రైజ్‌ను చిరంజీవి, శ్రీనివాసన్ నటరాజన్ అవార్డును ఆకాష్ ఉనియల్, ఆకురతి కుమారస్వామి ప్రదానం చేశారు.

ఐఐటీ పట్టభద్రుల పట్టాభిషేకం

ఐఐటీ పట్టభద్రుల పట్టాభిషేకం