
అత్యవసర సేవలకు సుస్తీ!
● సత్యవేడు ఆస్పత్రిలో మొక్కుబడిగా వైద్యసేవలు ● రాత్రివేళల్లో అంతా రెఫర్‌లకే పరిమితం ● మెరుగైన వైద్యానికి తమిళనాడు, తిరుపతికి రెఫర్లు ● ఇబ్బందులు పడుతున్న పేద, మధ్య తరగతి ప్రజలు
వరదయ్యపాళెం : సత్యవేడు కమ్యూనిటీ ఆసుపత్రిలో వైద్యసేవలు మొక్కుబడిగా మారాయి. ప్రధానంగా రాత్రివేళల్లో వైద్యం కోసం వచ్చే వారికి వైద్యం అందని ద్రాక్షగా మారింది. అక్కడ ఉన్న వైద్యులు మొక్కుబడి సేవలకే పరిమితం అవుతున్నారు. పేరుకు 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా కొనసాగుతుందే తప్ప పూర్తి స్థాయి వైద్య సేవలు అందడం లేదు. అత్యవసర వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనంత దూరంలో నిలిచాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న సత్యవేడు నియోజకవర్గ కేంద్రంలో ఏళ్ల తరబడి వైద్య సేవలకు భరోసా లభించడం లేదు.
సత్యవేడుకు సమీపంలో శ్రీసిటీ పారిశ్రామికవాడ ఉండడం. ఇటు తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో వందల మంది సత్యవేడు మీదుగా శ్రీసిటీ పరిశ్రమలకు ద్విచక్ర వాహనాలు, కార్లలో విధులకు వెళ్తుంటారు. అయితే ఈ మార్గంలో తరచూ రాత్రివేళ ప్రమాదాలు జరుగుతుంటాయి. వరదయ్యపాళెం, చిన్న పాండూరు, సత్యవేడు పరిసర ప్రాంతాలతో పాటు నాగలాపురం వరకు కమ్యూనిటీ వైద్యశాల సేవలు ఒక్క సత్యవేడులోనే ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడినా వైద్యం కోసం గుర్తుకొచ్చేది సత్యవేడు కమ్యూనిటీ వైద్యశాలే. ఇక్కడ మాత్రం అందుకు తగిన విధంగా మెరుగైన వైద్యసేవలు అందడం లేదని ప్రజల నుంచి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఓపీ తీసుకున్న వెంటనే అక్కడ వైద్యులు బాధిత రోగికి మెరుగైన వైద్యం చేయాలని మీరు తిరుపతి, తమిళనాడులోని తిరువళ్లూరు, చైన్నె ప్రాంతాలకు తీసుకు వెళ్లాలని ఉచిత సలహాలను ఇస్తున్నారు. దీంతో రాత్రివేళ వారికి అటు అంబులెన్స్ సౌకర్యం దొరక్క ప్రైవేటు వాహనాలతో వ్యయ ప్రయాసలతో ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి దాపురించింది.
అమలు కాని 100 పడకల ఎన్నికల హామీ
ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత హోదాలో సత్యవేడు టవర్ క్లాక్ సాక్షిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచార సభలో సత్యవేడు కమ్యూనిటీ హాస్పిటల్‌ను 100 పడకల ఏరియా ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే అధికారం చేపట్టి 13 నెలలు పూర్తవుతున్నా నేటికీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు.
పూర్తి స్థాయిలో వైద్యులు ఉన్నా..
సత్యవేడు సీహెచ్‌సీకి పూర్తి స్థాయిలో 12 మంది వైద్యులు ఉండాలి. రెండు నెలల క్రితం ఆరుగురి వైద్యులకే పరిమితం అయితే.. నేడు పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేయడం జరిగింది. అయితే వైద్యసేవలు మాత్రం నామ మాత్రంగానే మారాయి. కనీసం చిన్న పాయిజన్ కేసులకు వైద్యం చేయలేని దుస్థితిలో సేవలు కొనసాగుతుండడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రత్యేక చొరవతో ప్రస్తుతం బాధ్యతలు స్వీకరించిన వైద్యులు పేదలకు మెరుగైన వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
రాత్రివేళ సేవలు పటిష్టం చేయాలి
ప్రధానంగా రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన సత్యవేడులో రాత్రివేళ అత్యవసర వైద్యసేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వైద్యం కోసం ఆస్పత్రిని ఆశ్రయించే ప్రతి పేషెంటుకు ఆస్పత్రిలో ఉన్న వసతుల మేరకు వైద్యసేవలు అందించేందుకు విధుల్లో ఉన్న వైద్యులు చొరవ చూపాలి. ఎందుకంటే సత్యవేడు నుంచి అటు తిరుపతికి వెళ్లాలన్న, ఇటు చైన్నెకు వెళ్లాలన్న కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత వరకు ప్రాథమికంగా మెరుగైన వైద్యం అందించగలిగితే అత్యవసర పరిస్థితుల నుంచి సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లే వెసులుబాటు ఉంటుంది.
గర్భిణుల పరిస్థితి దయనీయం
సత్యవేడు కమ్యూనిటీ హాస్పిటల్‌లో గర్భిణుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధానంగా గర్భం దాల్చిన మహిళలు నెలసరి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి వస్తుంటారు. అయితే ఇక్కడ గైనకాలజిస్ట్ గత నెల వరకు అందుబాటులో లేరు. దీంతో అటు శ్రీకాళహస్తి, తిరుపతికి వెళ్లాల్సిన పరిస్థితి, అయితే తాజాగా గైనకాలజిస్ట్ విధుల్లో చేరారు. అయితే ఏ మేరకు గర్భిణులకు వైద్యసేవలు అందుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి.