
పరిహారం.. పరిహాసం
● పూర్తిస్థాయి పరిహారం చెల్లించకనే భూమి స్వాధీనానికి యత్నం ● ఏపీఐఐసీ చిన్నపాండూరు సెజ్‌లో అధికారుల అత్యుత్సాహం
వరదయ్యపాళెం : మండలంలోని చిన్న పాండూరుకు చెందిన డి.రత్నయ్య పేరిట సర్వే నంబర్ 83/3లో 1.73 ఎకరాలు, డి.శకుంతలమ్మ పేరిట సర్వే నంబర్ 83/2లో 1.48 ఎకరాల డీకేటీ భూమి ఉంది. 2015లో చిన్న పాండూరు ప్రాంతంలో అపోలో టైర్స్ పరిశ్రమ, మరికొన్ని ఇతర పరిశ్రమల ఏర్పాటు కోసం ఏపీఐఐసీ సెజ్ ఏర్పాటైంది. ఆ సమయంలో రైతులు డి.రత్నయ్య, బి.శకుంతలమ్మకు చెందిన భూములను భూ సేకరణకు నోటిఫై చేశారు. ఎకరాకు రూ. 6.50 లక్షలను పరిహారం కింద కేటాయించారు. అయితే అధికారుల తప్పిదంతో రత్నయ్య, శకుంతలమ్మ భూములకు బి కేటగిరీ కింద ఎకరాకు రూ.3.25 లక్షలు మాత్రమే కేటాయిస్తూ పరిహారాన్ని మంజూరు చేశారు. దీన్ని వ్యతిరేకించిన రైతులు ఇద్దరూ భూమి పూర్తి స్థాయిలో తమ అనుభవంలో ఉందని, అంతేకాక సాగు చేసుకుంటున్నామని భూములకు సంబంధించి డీ పట్టా, ఇతర పాసు పుస్తకాలు, రికార్డులు అన్నీ తమపైన ఉన్నా పూర్తిస్థాయి పరిహారం ఎందుకు ఇవ్వరని వారు కలెక్టర్ కు విన్నవించారు. అయితే అప్పటి నుంచి గత పదేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా నేటికీ పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. ఇప్పటి వరకు రైతులు ఇద్దరూ వారికి చెందిన భూముల్లో ఏటా పంట సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
పదేళ్లుగా పోరాటం
రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదానికి ఆ రైతులకు పదేళ్లుగా పోరాటమే మిగిలింది. తమ భూమికి ఎకరాకు ప్రభుత్వం కేటాయించిన రూ. 6.50 లక్షలు అందాల్సి ఉండగా అందులో బి కేటగిరీ ద్వారా సగం పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. 2016లో పరిహారం చెల్లించే ప్రక్రియ జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు వృద్ధాప్యంలో ఉన్న రైతులు రత్నయ్య, శకుంతలమ్మ గత పదేళ్లుగా తిరుగుతూనే ఉన్నా సమస్యకు పరిష్కారం లభించలేదు. ఇప్పటికీ రైతు రత్నయ్యకు రూ. 5.61 లక్షలు, శకుంతలమ్మకు రూ.4.81 లక్షల పరిహారం చెల్లించాల్సి ఉంది.
రైతులు రాకుండా ట్రెంచ్‌ల ఏర్పాటు
రైతు రత్నయ్య, శకుంతలమ్మ భూమి చుట్టూ దారి లేకుండా రైతులు పొలంలోకి రాకుండా ట్రెంచ్‌లు ఏర్పాటు చేశారు. కందకాలను తక్షణమే పూడ్చివేసి భూములకు దారి సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై వరదయ్యపాళెం మండలం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామని వారు చెబుతున్నారు. తక్షణమే ఏపీఐఐసీ ఉన్నతాధికారులు స్పందించి తాము సాగు చేసుకునేందుకు వీలుగా దారి సౌకర్యం కల్పించాలని వారు కోరుతున్నారు.
ఏపీఐఐసీ నుంచి పరిహారం అందజేశాం
వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ఏపీఐఐసీ సెజ్‌కు సంబంధించి రెండో విడతలో 17.16 ఎకరాలను భూసేకరణ ద్వారా ఏపీఐఐసీకి స్వాధీన పరిచారు. అయితే ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన విధంగా పరిహారం మొత్తాన్ని భూ సేకరణ విభాగానికి అందజేశాం. అయితే రైతులకు రికార్డుల ఆధారంగా భూసేకరణ అధికారులు, రెవెన్యూ అధికారుల సమన్వయంతో రైతులకు పరిహారం అందించాల్సి ఉంది. భూసేకరణ అధికారులు ఇచ్చిన మేరకు ఏపీఐఐసీ ఆ భూములను స్వాధీనం చేసుకుంది. త్వరలో ఆ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. అందు కోసం రైతులు సాగు చేసుకునేందుకు వీలు లేకుండా ట్రెంచ్‌లు తవ్వించాం. పరిహారం అందని రైతుల వివరాలను మరోసారి పరిశీలన చేసి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింపజేస్తాం. అప్పటి దాకా రైతులు సహకరించాలి.
– విజయ్ భరత్ రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తిరుపతి

పరిహారం.. పరిహాసం