
జాతీయ రహదారిపై అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్!
● ఆటోలో తరలించి విచక్షణా రహితంగా దాడి ● చికిత్స కోసం రుయాకు తరలించిన స్నేహితులు ● తిరుపతి రూరల్ పోలీసులపై జిల్లా ఎస్పీ ఆగ్రహం ● బాధితుని వాంగ్మూలంతో కేసు నమోదు చేసిన సీఐ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పూతలపుట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై వందలాది వాహనాలు సంచరిస్తున్నా అర్ధరాత్రి ఓ యువకుడుని కిడ్నాప్ చేసి ఆటోలో తరలించారు. ఆపై విచక్షణా రహితంగా అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తిరుపతి రూరల్ మండలం లింగేశ్వరనగర్ పంచాయతీకి చెందిన శశి యాదవ్, అతని స్నేహితుడు తాహిర్‌బాబాతో కలసి జాతీయ రహదారి వద్ద ఉన్న నిధి కేఫ్‌కు మంగళవారం అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు. అక్కడ వాటర్ బాటిల్ తీసుకుని తాగుతుండగా కొందరు యువకులు అక్కడకు చేరుకుని శశియాదవ్‌ను బలవంతంగా కిడ్నాప్ చేసి ఆటోలో చంద్రగిరి మండలం తొండవాడ వద్ద ఉన్న ఓ ప్రైవేటు వెంచర్‌కు తీసుకెళ్లారు. శశియాదవ్‌ను కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్న ఆటోను కొంత దూరం నుంచి వెంబడించిన తాహిర్‌బాబా విషయాన్ని తమ స్నేహితులకు చేరవేశాడు. ఆ విషయం తెలుసుకున్న శశియాదవ్ స్నేహితులంతా తొండవాడ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కిడ్నాపర్లు శశి యాదవ్‌ను చచ్చేలా కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంతలో శశియాదవ్ స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకోవడాన్ని గమనించిన కిడ్నాపర్లు అక్కడ నుంచి పరారయ్యారు. శశియాదవ్‌ను స్నేహితులు చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా అంత గొడవ జరిగినా తెలుసుకోలేని తిరుపతి రూరల్ పోలీసులు బుధవారం ఉదయం కిడ్నాప్ వ్యవహారాన్ని తెలుసుకుని రుయా ఆస్పత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న శశియాదవ్ ద్వారా వివరాలు తెలుసుకుని స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. కిడ్నాప్‌నకు ప్రధాన కారణం ఇటీవల జాతరలో జరిగిన పాత కక్షలేనని నిర్ధారించుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం వేట ప్రారంభించారు. శశి యాదవ్‌ను కిడ్నాప్ చేసిన వారిలో సంతు, తేజ, అజయ్, పునీత్‌తో ఆటు మరో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టుగా గాయపడిన శశియాదవ్ పోలీసులకు వివరించడంతో వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. బాధితుని ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవిందు కేసు నమోదు చేశారు.
తిరుపతి రూరల్ పోలీసులపై ఎస్పీ ఆగ్రహం
జాతీయ రహదారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ బలవంతంగా ఒక యువకుడిని కిడ్నాప్ చేసి ఆటోలో తరలించి చచ్చేలా కొడుతున్నప్పటికీ గుర్తించలేకపోవడం, కనీస సమాచారం కూడా పోలీసులకు రాకపోవడంపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తిరుపతి రూరల్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అసలు రాత్రి వేళల్లో జాతీయ రహదారిపై తిరగాల్సిన పెట్రోలింగ్ సిబ్బంది ఏమయ్యారు? జాతీయ రహదారిపై రాత్రి వేళ ఏం జరిగినా ఇలాగే వదిలేస్తారా? కనీసం ఆ నిధి కేఫ్ వారు కూడా పోలీసులకు సమాచారం ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఎస్పీ ఆగ్రహంతో అప్రమత్తమైన తిరుపతి రూరల్ పోలీసులు హుటాహుటిన ఆ కేఫ్ వద్దకు చేరుకుని అక్కడ ఏం జరిగిందన్న దృశ్యాలను అక్కడి సీసీటీవీ పుటేజీ ద్వారా తీసుకుని బాధితుని వద్దకు వెళ్లి వాంగ్మూలం తీసుకున్నట్టు సమాచారం.