
దారి కల్పించే వారేరీ?
● ఎంపీపీ ఆదేశాలతో గ్రామానికి వెళ్లిన అధికారులు ● రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక వెనుదిరిగిన వైనం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: పట్టా భూముల్లో దారి కావాలంటే కుదరదని చెప్పినందుకు ఆ ఇంటికి రాకపోకలు లేకుండా చేశారు.. కూటమి నేతలందరూ ఏకమై ఆ కుటుంబాన్ని వారం రోజులుగా బయటకు రానీయకుండా ని ర్భందించారు. అత్యవసరానికి సైతం వెళ్లడానికి వీలు లేకుండా గ్రామంలోని సిమెంటు రోడ్డుకు అడ్డుగా ఇ నుప కంచెను నిర్మించారు. ఆ ఇంటికి దారి కల్పించే బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో ఆ పనిచేయలేకున్నారు. గ్రామంలోకి వెళ్లి కళ్లారా అక్క డ జరుగుతున్న దుశ్చర్యలను చూసినప్పటికీ రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక దారి సమస్యను అలాగే వదిలేసి వెనుదిరిగారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లి పంచాయతీ బడగనపల్లిలో నివాసముంటున్న వెంకటరమణ ఇంటికి రాకపోకలు లేకుండా చేశారు. వారం రోజులకు పైగా ఆ ఇంట్లోని సభ్యులు ఎవరు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మండలస్థాయి అధికారులకు విన్నవించినా ఏ ఒక్కరు పట్టించుకోలేదు. దీంతో బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రెడ్డెమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు కరుణాకర్‌రెడ్డి అధికారులను నిలదీశారు. బడగనపల్లిలో ఓ ఇంటికి దారి లేకుండా ఇనుప కంచె ఏర్పాటు చేస్తే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాజకీయ కక్షలతో ఓ కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేయడం, అందుకు అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్వసభ్య సమావేశం ము గిసిన తరువాత ఎంపీడీఓ మదన మోహన్‌రెడ్డి, తహసీల్దార్ పరమేశ్వరస్వామి, ఎస్‌ఐ బాలకృష్ణలు ఆ గ్రా మానికి చేరుకుని దారికి అడ్డుగా ఏర్పాటు చేసిన ఇను ప కంచెను పరిశీలించారు. అసలు ఆ కంచె ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలుసుకుని పట్టా భూ ముల్లో శాశ్వత రోడ్డు కావాలంటే పట్టాదారు అనుమ తి కావాల్సిందేనని, అలా ఇవ్వనందుకు ప్రభుత్వ ని ధులతో నిర్మించిన సిమెంటు రోడ్డుపై కంచె ఏర్పాటు చేయడం చట్ట వ్యతిరేకమని సూచించారు. అయినా సరే కంచెను తీసేదిలేదని కూటమి పార్టీలకు చెందిన వారు భీష్మించుకున్నారు. ఇంతలో స్థానిక ముఖ్యప్రజాప్రతినిధి నుంచి ఫోన్లు రావడంతో అధికారులు ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. అనంతరం కొంతసేపటికి ఇనుపకంచెను తొలగించకుండానే వెనుదిరిగారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక వెనుదిరగాల్సి వస్తోందని బాధిత కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లడం గమనార్హం.