
భద్రత ప్రశ్నార్థకం!
భరోసా..
● నైపుణ్యం లేని కార్మికులతో భారీ యంత్రాల వద్ద పనులు ● రియాక్టర్లు, బాయిలర్ల వద్ద తరచూ ప్రమాదాలు ● అమలు కానీ కార్మిక చట్టాలు ● పట్టించుకోని అధికారులు, పాలకులు
తమ కుటుంబ పోషణకు..సంస్థ పురోభివృద్ధికి కార్మికులు నిరంతరం పని చేస్తూ, స్వేదం చిందిస్తున్నారు. అయితే వారికి కష్టం వచ్చినా.. నష్టం వచ్చినా.. అనారోగ్యం బారిన పడినా.. ప్రాణం పోయినా పట్టించుకునే వారు కరువయ్యారు. వారి కుటుంబానికి అండగా నిలిచేవారు లేకుండా పోయారు. కార్మికులకు చేయూతనిచ్చే చట్టాలు అమలుకు నోచు కోకుండా పోయాయి. ఫలితంగా వారికి భరోసా.. భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
స్టీల్ పరిశ్రమ నుంచి విడుదలవుతున్న పొగ
పెళ్లకూరు : పొట్టకూటి కోసం రాష్ట్రాలను దాటి వలస వచ్చిన కార్మికులు పలు పరిశ్రమల్లో ప్రమాదకరమైన యంత్రాల వద్ద పనులు చేస్తూ ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అధికారులు, పాలకులు మాత్రం తమకు పట్టదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలోని పెన్నేపల్లి, శిరసనంబేడు గ్రామాల్లో పలు స్టీల్ పరిశ్రమలున్నాయి. ఆయా పరిశ్రమల్లో ఎక్కువ మంది పొరుగు రాష్ట్రాల కార్మికులతో భారీ యంత్రాల వద్ద పనులు చేయిస్తున్నారు. పెన్నేపల్లిలో ఉన్న ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో జనవరి ఒకటో తేదీన జరిగిన భారీ విస్పోటనంలో ముగ్గురు వలస కార్మికులు మృత్యువాత పడగా మరో నలుగురికి గాయాలయ్యాయి. జూన్ 26న జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. యాజమాన్యాల నిర్లక్ష్యంతోనే పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. పారిశ్రామిక అభివృద్ధి మాటున కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కంపెనీ యాజామాన్యానికి కల్పిస్తున్న అవకాశాలు, ప్రమాదాలు పెరగడానికి ఒక కారణంగా మారింది. మండలంలోని స్టీల్ పరిశ్రమల్లో ఎక్కువ మంది వలస కార్మికులే ప్రమాదకరమైన, భారీ యంత్రాల వద్ద పనులు చేస్తున్నారు. వాటి వద్ద పని చేసే వలస కార్మికులకు కనీస అవగాహన, నైపుణ్యం లేకపోవడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. నిరంతరం నడుస్తున్న భారీ యంత్రాలు అధిక రాపిడికి గురై విస్పోటనం చెందే పరిస్థితిని ముందుగానే పసిగట్టే టెక్నాలజీ లేకపోవడంతో ఇక్కడ కార్మికులు ప్రమాదాల బారిన పడడానికి మరో కారణంగా తెలుస్తోంది.
ప్రాణాలు పోతున్నా పట్టించుకొనేవారు లేరు
వలస వచ్చిన కార్మికులు ప్రమాదకరమైన యంత్రాల వద్ద పనులు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నా స్థానికంగా పట్టించుకునేవారు కరువయ్యారు. పరిశ్రమల్లో జరుగుతున్న అనేక ప్రమాదాల్లో సమాచారం బయటకు పొక్కకుండా దాచేసే ఘటనలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నా రు. ఈ క్రమంలోనే పరిశ్రమను తనిఖీ చేసేందుకు వచ్చే అధికారులతో లోపాయికారి ఒప్పందాలు, రహస్య మంతనాలు చేసుకుంటూ మీడియా ప్రతినిధులను పరిశ్రమ గేటు దాటనీయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపయడం విశేషం. జనవరి ఒకటో తేదీన భారీ విస్పోటనం జరిగిన పెన్నేపల్లి స్టీల్ పరిశ్రమ వద్దకు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు చేరుకుని పరిశీలించారు. అయితే కంపెనీ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో జూన్ మాసంలో మరో ప్రమాదం జరిగి మరొకరు మృత్యువాత పడ్డారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతా ప్రమాణాలు ఎవరికీ పట్టడం లేదు. కార్మికుల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు, ముందుజాగ్రత్త చర్యలు పరిశ్రమ శాఖలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ విభాగం అధికారులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పరిశ్రమలను క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తూ, ప్రమాదాల జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కార్మిక చట్టాలను ఉల్లంఘించే కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు యాజమాన్యంతో కుమ్మకై ్క మాముళ్లకు అలవాటు పడినట్లు తెలుస్తుంది. కార్మిక చట్టాల ఉల్లంఘనపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

భద్రత ప్రశ్నార్థకం!

భద్రత ప్రశ్నార్థకం!