
జేసీ లాగిన్.. ఆశలు ఆగెన్!
కూటమి ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం అర్హులందరికీ అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. వివిధ సాకులతో నిరుపేదలపై అనర్హత వేటు వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రీవెన్స్‌లో వినతులు సమర్పించినప్పటికీ సకాలంలో పరిష్కరించడం లేదని మండిపడుతున్నారు. ప్రధానంగా జాయింట్ కలెక్టర్ లాగిన్‌కు వెళ్లిన అర్జీలకు అతీగతీ లేకుండా పోతోందని వాపోతున్నారు.
తిరుపతి అర్బన్ : తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాకపోవడానికి రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఆదాయపు పన్ను, కరెంట్ బిల్లు అధికంగా రావడం వంటి కారణాలను అధికారులు చెబుతున్నారు. అయితే ఏదైనా చిన్న చిన్న పొరబాట్లు ఉంటే వాటిని సులభంగా పరిష్కరించి అర్హులకు పథకం ఫలాలు అందించాల్సి ఉంది. క్షేత్ర స్థాయిలో సచివాలయ పరిధిలోనే పరిష్కరించాల్సిన అంశాన్ని జేసీ లాగిన్ వరకు పంపుతున్నారు. ముందుగా తహసీల్దార్ ఆఫీస్, తర్వాత ఆర్డీఓ ఆఫీస్ ఆ తర్వాత జేసీ ఆఫీస్ అంటున్నారు. ఈ క్రమంలో జేసీ లాగిన్ అంటేనే ప్రజలు వామ్మో ఇక అయినట్లే అంటూ హడలిపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా పొరబాటున అర్హులకు అమ్మఒడి అందకుండా ఉంటే క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చూపించేవారు. అయితే కూటమి సర్కార్‌లో చిన్న సమస్య పరిష్కారం కోసం జేసీ లాగిన్ అంటూ చేతులుదులిపేసుకుంటున్నారు. దీంతో పెద్దసంఖ్యలో తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అర్హులకు సైతం అందని తల్లికి వందనం వివిధ కారణాలతో మొండిచేయి చూపుతున్న ప్రభుత్వం గ్రీవెన్స్‌లో అర్జీలు పెట్టుకుని ఎదురు చూస్తున్న అమ్మలు అన్ని అడ్డంకులు దాటినా.. జేసీ కార్యాలయం వద్ద బ్రేకులు
తిరుగుతూనే ఉన్నాం
మా కుమార్తె కీర్తి 7వ తరగతి చదువుతోంది. తల్లికి వందనం నగదు మా బ్యాంక్ ఖాతాలో జమకాలేదు. ఈ విషయాన్ని విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లు చూపడంతో జమ కాలేదని చెప్పారు. దాంతో 20 రోజుల క్రితం సచివాలయంలో అన్ని డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకున్నాం. ఆ తర్వాత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని చెప్పారు. అక్కడ క్లియర్ చేశాక, ఆర్డీఓ ఆఫీస్‌కు వెళ్లాలని చెప్పారు. అక్కడ కూడా అన్నీ క్లియర్ చేశాం. ఆ తర్వాత జేసీ లాగిన్‌లో క్లియరెన్స్ రావాలని చెప్పారు. 15 రోజులుగా జేసీ లాగిన్‌లోనే పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో జేసీ కార్యాలయ సిబ్బందిని కలిశాం. వారు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను తీసుకురావాలని, అందులో డీఆర్‌ఓ ఇన్‌షియల్ వేసుకువస్తే...ఫైల్‌ను జేసీకి పెడతామని చెబుతున్నారు. ఇలా నెల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నా పని మాత్రం కాలేదు. – ఎం.మంజుల, విద్యార్థిని తల్లి, శ్రీకాళహస్తి

జేసీ లాగిన్.. ఆశలు ఆగెన్!