
19న పీ4 సర్వేపై సీఎం ముఖాముఖి
తిరుపతి రూరల్ : సీఎం చంద్రబాబు ఈ నెల 19వ తేదీన తిరుపతిలో పీ4 సర్వేపై ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇదే అంశంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం తన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఆర్థిక సాధికారత చేకూర్చడం, జీవన ప్రమాణంలో అట్టడుగు స్థాయిలో ఉన్న 20 శాతం మంది పేదల(బంగారు కుటుంబాలు)ను గుర్తించి ఆర్థికంగా వృద్ధి చెందిన (మార్గదర్శకులు) వారి ద్వారా సాయం చేయించడమే పీ4 సర్వే విధానమన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఇప్పటికే పీ4 సర్వే చాలా వరకు పూర్తయినందున పది శాతం మార్గదర్శకులు, 20 శాతం బంగారు కుటుంబాల వివరాలను అందుబాటులో పెట్టుకోవాలన్నారు. పీ4 సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలు, మార్గదర్శకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, డీపీఓ సుశీలాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య మార్గదర్శకుల స్థానంలో వచ్చిన తాజ్ హోటల్, రాస్, అమరరాజా, రోటరీ క్లబ్, పాయ్ వైస్రాయ్ హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు.