
జాతీయ చేనేత, హస్తకళ విభాగంలో జిల్లాకు మొదటి బహుమతి
– వెంకటగిరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ గుర్తింపు
తిరుపతి అర్బన్: ఢిల్లీ ప్రగతి భవన్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఒన్ డిస్ట్రిక్ ఒన్ ప్రాడక్ట్ కార్యక్రమంలో చేనేత హస్త కళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని కై వసం చేసుకుంది. సోమవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అవార్డు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో చేనేత, హస్తకళల విభాగంలో తిరుపతి జిల్లా మొదటి బహుమతిని పొందడం చాలా గర్వకారణమని తెలిపారు. వెంకటగరి పట్టు చీరల ప్రత్యేకతకు జాతీయ స్థాయి గుర్తింపు లభించిందన్నారు. జాతీయస్థాయిలో తిరుపతి జిల్లా హ్యాండ్లూమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్ కేటగిరీలో మొదటి బహుమతి (బంగారు కేటగిరి)ని గెలుచుకోవడం చేనేత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒకరి కృషి ఫలితమేనన్నారు. జిల్లాలో ఓడీఓపీ కింద ప్రోత్సహిస్తున్న వెంకటగిరి పట్టు చీరలు, స్థానికంగా తయారు చేస్తున్న చేనేత ఉత్పత్తుల వైశిష్ట్యం, నాణ్యత ఈ గౌరవానికి కారణమని తెలిపారు. ఇలాంటి పురస్కారాలు స్థానిక కళాకారులకు ప్రోత్సాహాన్ని కలిగించడంతోపాటు, వారి జీవనోపాధికి మద్దతుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జితిన్ ప్రసాద్, ఢిల్లీ సీఎం రేఖ గుప్త, బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్ మినిస్టర్ సవిత, జిల్లా చేనేత అధికారి రాచపూడి రమేష్ పాల్గొన్నారు.
ఘరానా దొంగ అరెస్ట్
తిరుపతి క్రైమ్: జిల్లాలోని నాయుడుపేట, సత్యవేడు ప్రాంతాల్లోని ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్పీ తెలిపిన వివరాల మేరకు, ఈ నెల 5న గుర్తు తెలియని వ్యక్తి నాయుడుపేటలోని మూగాంబికా దేవాలయం వీధిలో నివాసం ఉంటున్న గంగినేని హరేంద్ర ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 416 గ్రాముల బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు సూళ్లూరుపేట డీఎస్పీ చెంచు బాబు, సీఐ బాబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పార్వతీపురం జిల్లాకు చెందిన చందాక మణికంఠ(28) అనుమానాస్పదంగా తిరుగుతుంటే నాయుడుపేటలో అరెస్ట్ చేశారు. ఎవరిరీ అనుమానం రాకూడదని ఉద్దేశంతో పార్వతీపురం నుంచి ఇక్కడికి వచ్చి దొంగతనాలు పాల్పడేవారు. ఇతనిపై సూళ్లూరుపేట పరిధిలో ఐదు కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా తడ, శ్రీ సిటీ, వరదయ్యపాళెం పోలీస్ స్టేషన్లో ఒక కేసు విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని మొవ్వలవారి పాళెం పోలీస్ స్టేషన్లో మూడు కేసులు, ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసులు ఉన్నాయి. సుమారు ఇప్పటివరకు 14 కేసులకు పైగా ఉన్నట్లుగా గుర్తించారు. నాలుగు కేసులకు సంబంధించి 416 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఇతన్ని రిమాండ్‌కి తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

జాతీయ చేనేత, హస్తకళ విభాగంలో జిల్లాకు మొదటి బహుమతి