
వందశాతం హాజరు
తిరుపతి అర్బన్: పాఠశాలలు పునఃప్రారంభం నుంచి అంటే జూన్ 12 నుంచి జూలై 7 వరకు జిల్లాలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, జిల్లాలోని విద్యార్థులు వందశాతం హాజరు సాధించడంతో తిరుపతి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. దీంతో విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు, రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్‌తోపాటు పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్ కుమార్‌తోపాటు తిరుపతి జిల్లా విద్యాశాఖను సోమవారం అభినందించారని డీఈవో ఓ ప్రకటనలో తెలిపారు.
కౌన్సెలింగ్ ప్రారంభం
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో ఈఏపీసెట్–2025కు సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్వీయూ లా కళాశాల భవనంలోనూ, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోనూ కౌన్సెలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్లను ప్రారంభించారు. విద్యార్థులు ఈ నెల 16వరకు రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 13 నుంచి 18వ తేదీవరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 19వ తేదీ ఆప్షన్స్ మార్పులకు అవకాశం ఇస్తూ ఈనెల 22న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మామిడి రైతులకు
అండగా ఉంటాం
తిరుపతి అర్బన్: మామిడి రైతులకు అండగా ఉంటామని కలెక్టర్ వెంకటేశ్వర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 76,700 మంది రైతులు 80వేల హెక్టార్లలో తోతాపురి మామిడి పంట సాగు చేశారని చెప్పారు. అందులో తిరుపతి జిల్లాలో 14,582 హెక్టార్లలో సాగుచేస్తే 1.45 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. జిల్లాలో 8 గుజ్జు ప్రాసెసింగ్ యూనిట్లు, 39 ర్యాంప్‌లు, 3 మండీలు ఉన్నాయని వివరించారు. 8 యూనిట్ల సామర్థ్యం 1.21 లక్షల మెట్రిక్ టన్నులుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో టన్ను రూ.12కి కొనుగోలు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఫ్యాక్టరీ వారు రూ.8కి కొనుగోలు చేస్తే, ప్రభుత్వం రూ.4 ఇస్తుందని చెప్పారు. అందరికీ న్యాయం చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 88,938 మంది స్వామివారిని దర్శించుకోగా 28,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.