
విద్యా ప్రదాత వైఎస్సార్
ఆయన హయాంలోనే వెటర్నరీ వర్సిటీ
రైతు బాంధవుడిగా ప్రజల్లో చెరగని ముద్ర
తిరుపతి వేదిక్ వర్సిటీ నెలకొల్పిన మహనీయుడు వైఎస్సార్
నేడు వైఎస్సార్ 76వ జయంతి సందర్భంగా ఆయన సేవల స్మరణ
తిరుపతి సిటీ: ప్రతి పేదవాడి ఇంటిలో డాక్టర్, ఇంజినీర్ ఉండాలని కలలు కన్న పేదల పక్షపాతి వైఎస్సార్. బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో విద్యారంగంలో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీంతో ఇంజినీరింగ్, మెడికల్ కళాశాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందించి ప్రోత్సహించారు. దీంతో పేదింటి పిల్లలు కూడా ఉన్నత చదువులు అభ్యసించి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని కృషి చేసి రైతు బాంధవుడిగా తెలుగు ప్రజల గుండెలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, వేదిక్ వర్సిటీలను వైఎస్సార్ మానసపుత్రికలుగా నేటికీ ప్రజలు కొనియాడుతున్నారంటే ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పవచ్చు.
నేడు వైఎస్సార్ జయంతి
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలేని లోటు రైతులకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన చలవతో పశువైద్య విద్యను అభ్యసించిన పేద విద్యార్థులు సైతం నేడు ఉన్నతస్థాయిలో రాణిస్తున్నారు. నేడు వారంతా వైఎస్సార్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజలు, వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ 76వ జయంతిని ఘనంగా జరపుకోనున్నారు.
మా ఆరాధ్య దైవం
రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో హోటళ్లలో భార్యాభర్తలు పనిచేస్తుండేవాళ్లం. వైఎస్సార్ హయాంలో మా అమ్మాయికి ప్రభుత్వ కళాశాలలో ఇంజినీరింగ్ సీటు లభించింది. ఆ తరువాత లండన్‌లో ఉద్యోగం రావడంతో అక్కడే స్థిరపడింది. మేము ఆర్థికంగా బలపడ్డాం. మాకు వైఎస్సార్ ఆరాధ్యదైవం. మేము బతికున్నంత కాలం ఆయన సేవలను మరచిపోలేం. – సరస్వతి, గృహిణి, తిరుపతి రూరల్
ఆయన పేదల పక్షపాతి
పేదల పక్షపాతిగా, రైతు బాంధవుడిగా డాక్టర్ వైఎస్సార్ మా గుండెల్లో నిలిచిపోయారు. ఆయన తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీతో జిల్లాలో లక్షలాదిమంది లబ్ధి పొంది ప్రాణాలు కాపాడుకుంటున్నారంటే ఇది వైఎస్సార్ చలువే. విద్యారంగంలో మహిళలకు పెద్ద పీట వేశారు. ఆయన తీసుకొచిచన సంస్కరణలు ఎంతో మంది మహిళలను ఉన్నత స్థానానికి చేర్చాయి. – పద్మావతమ్మ, తిరుపతి
ఆయనలేని లేటు స్పష్టంగా కనిపిస్తోంది
డాక్టర్ వైఎస్సార్ పేదల పక్షపాతిగా ప్రజలు ఇప్పటికీ కొనియాడుతున్నారు. ఆయన విద్యా రంగంలో చేసిన సంస్కరణలతో ఎంతో మంది పేదల పిల్లలు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా దేశ, విదేశాలలో రాణిస్తున్నారు. తిరుపతి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా రూపొందించడంలో ఆయన కృషి ఎనలేనిది. ఆయన లేనిలోటు ప్రస్తుతం తెలుగు ప్రజలకు స్పష్టంగా కనబడుతోంది.
– రామకృష్ణారెడ్డి, రిటైర్డ్ టీచర్, తిరుపతి
వైఎస్సార్ మా ఇంటిదేవుడు
మాలాంటి పేదలు అందుకోలేని వైద్య విద్యను మాకు దగ్గర చేశారు. వైఎస్సార్ చేపట్టిన సంస్కరణలతో నాకు ఎంబీబీఎస్ లో సీటు వచ్చింది. తల్లి దండ్రులు కూలికి వెళ్లితేగాని కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి అమెరికాలో పేరొందిన ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాను. ఇదంతా డాక్ట ర్ వైఎస్సార్ చలవే. ఆయన్ను మా ఇంటిదేవుడిగా ఇప్పటికీ కొలుస్తున్నాం. – డాక్టర్ కేశవులు, తిరుపతి

విద్యా ప్రదాత వైఎస్సార్

విద్యా ప్రదాత వైఎస్సార్

విద్యా ప్రదాత వైఎస్సార్

విద్యా ప్రదాత వైఎస్సార్