
సార్వత్రిక సమ్మెకు టీటీడీ ఉద్యోగుల మద్దతు
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మికుల ప్రయోజనాల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు తమ మద్దతు ఉంటుందని టీటీడీ ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు ప్రకటించారు. ఆదివారం స్థానిక సంఘం కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొని చర్చించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి లక్షల మంది ఉద్యోగులకు పెన్షన్ లేకుండా చేసి వారి హక్కులను హరింపజేశారన్నారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పనిని 12 గంటలకు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టీటీడీ ఎస్‌డబ్లుఎఫ్ నాయకులు గోల్కొండ వెంకటేశం, కాటా గుణశేఖర్, పట్నం దయాకర్, నైనార్ పద్మనాభం, వేణుగోపాల్, రవికుమార్ , ఆదిలక్ష్మి, మునికిరణ్ కుమార్, ధనంజేయులు, శ్రీనివాసులు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.