
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఆరుగురికి చోటు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ హోదాల్లో ప్రకటించిన పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం ఉపాధ్యక్షులుగా పుంగనూరుకు చెందిన పుష్పావతి, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ జనరల్ సెక్రటరీగా తిరుపతికి చెందిన కేతంరెడ్డి మురళీరెడ్డి, రాష్ట్ర సెక్రటరీలుగా గంగాధర్ నెల్లూరుకు చెందిన వి.సుందర్ రాజు, సత్యవేడుకు చెందిన జేబీ.మునిరత్నం (జేబీఆర్), తిరుపతికి చెందిన తిరుమల రెడ్డి, భరత్ రెడ్డిను నియమించారు. వీరిలో చిత్తూరు జిల్లా నుంచి పలమనేరుకు చెందిన జి.ప్రహ్లాద, ఆర్.చెంగారెడ్డి, ఎస్‌డీ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా నుంచి శ్రీకాళహస్తికి చెందిన షేక్ సిరాజ్‌బాషా ఉన్నారు.
రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపిక
తిరుపతి ఎడ్యుకేషన్: అండర్–15 రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు తిరుపతికి చెందిన ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. జూన్ 29 నుంచి జూలై 1వ తేదీ వరకు మదనపల్లిలో రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా జట్టు 2వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన తిరుపతికి చెందిన ఆదిత్య, హిమకేష్‌లను రాష్ట్ర జట్టుకు రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎంపిక చేసినట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి రెడ్డెప్ప తెలిపారు. త్వరలో విశాఖపట్నంలో నిర్వహించనున్న క్యాంపులో పాల్గొననున్నారని, ఆ తరువాత పంజాబ్‌లో జరిగే జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున వీరిద్దరు పాల్గొననున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర జట్టుకు ఎంపికై న వీరిని జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
తాళం పగులగొట్టి చోరీ
● 55 సవర్ల బంగారు నగలు,
3 లక్షల నగదు అపహరణ
నాయుడుపేటటౌన్ : నాయుడుపేట పట్టణంలోని మూకాంబిక గుడి వీధిలోని ఓ ఇంటిలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటనను బాధిత కుటుంబ సభ్యులు శనివారం రాత్రి గుర్తించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సీఐ బాబి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ముకాంబిక గుడి వీధిలో నివాసం ఉంటున్న హరేంద్ర, అతడి భార్య సునీత శనివారం ఉదయం 10.30 గంటలకు గూడూరులో జరిగే జగన్నాథ యాత్రలో పాలు పంచుకునేందుకు వెళ్లారు. తిరిగీ రాత్రి ఇంటికి వచ్చే సరికి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటాన్ని చూసి అవాక్కాయ్యారు. ఇంటిలోకి వెళ్లి చూడగా 30 సవర్ల బంగారు, నగదు రూ.50 వేలు, వెండి వస్తువులు, సునీత స్నేహితురాలిగా ఉన్న మరో మహిళకు సంబంధించిన 25 సవర్ల బంగారు నగలు, రూ.2.50 లక్షల నగదును చోరీ చేసుకుని వెళ్లి ఉండటాన్ని బాధితులు గుర్తించారు. అయితే ఈ దొంగతనం మధ్యాహ్న సమయంలో జరిగి ఉండవచ్చునని బాధితులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.