
చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై ఆందోళన
● నల్ల జెండాలతో నిరసన ..రోడ్డుపై బైఠాయింపు
రామచంద్రాపురం : చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం రోడ్డెక్కారు. చెవిరెడ్డి కుటుంబంపై రాజకీయ కక్ష తగదు అంటూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రామచంద్రాపురం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పచ్చికాపల్లం, తిరుపతి రహదారిపై కొంత సేపు బైఠాయించి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా అర్సీపురం మండలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందారెడ్డి, జడ్పీటీసీ రాణితో పాటు పలువురు నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను నులిమేస్తూ అక్రమ కేసులు పెడుతోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చూపుతూ ప్రత్యర్థులపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. చెవిరెడ్డిని అక్రమ కేసుల నుంచి తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చెవిరెడ్డి కుటుంబానికి
అండగా నిలబడుతాం
చెవిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి తామంతా సిద్ధంగా ఉన్నామంటూ చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ నేతలు ముందుకు వచ్చారు. చెవిరెడ్డి జైలు నుంచి బయటకు వచ్చే వరకు తమ పోరాటాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చంద్రగిరి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం, తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

చెవిరెడ్డి అక్రమ అరెస్టుపై ఆందోళన